Indigo Airlines: ఇండిగో ప్రయాణికులకు రూ.827 కోట్ల రిఫండ్

Indigo Airlines Issues 827 Crore Refund to Passengers
  • మిగిలిన వారికి డిసెంబర్ 15 లోగా చెల్లింపులు జరుపుతామని వెల్లడి
  • డిసెంబర్ 1 నుంచి 7 వరకు 5,86,705 టిక్కెట్లు రద్దు
  • రూ.570 కోట్లు ప్రయాణికులకు అందినట్లు ప్రకటన
విమాన సర్వీసులు నడపలేక తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్ లైన్స్ ఇప్పటివరకు పలువురు ప్రయాణికులకు రూ.827 కోట్లు రిఫండ్ చేసింది. మిగిలిన వారికి డిసెంబర్ 15 లోగా చెల్లింపులు జరుపుతామని వెల్లడించింది. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం వల్ల నవంబర్ 21 నుంచి డిసెంబూర్ 1 వరకు 9,55,591 టిక్కెట్లు రద్దయినట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది. వీటి విలువలో రూ.827 కోట్లు రిఫండ్ చేసినట్లు పేర్కొంది. డిసెంబర్ 1 నుంచి 7 వరకు 5,86,705 టిక్కెట్లు రద్దు కాగా, రూ.570 కోట్లు ప్రయాణికులకు అందినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

విమానాల సర్వీసుల రద్దు వల్ల వివిధ విమానాశ్రయాల్లో దాదాపు 9,000 బ్యాకేజీలు నిలిచిపోయినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వాటిలో 4,500 బ్యాగులను ఇప్పటికే ప్రయాణికులకు అందజేసినట్లు తెలిపింది. వచ్చే 36 గంటల్లో మిగిలిన వాటిని డెలివరీ చేసేందుకు ఇండిగో ఏర్పాటు చేస్తోంది. సోమవారం మొత్తం 500 సర్వీసులు రద్దయ్యాయని వెల్లడించింది.

ఇదిలా ఉండగా, సర్వీసుల పునరుద్ధరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తమ మాతృసంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ప్రత్యేకంగా ఒక క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు ఇండిగో తెలిపింది. డిసెంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో దీని ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Indigo Airlines
Indigo
Airlines
Refund
Flight Cancellation
Air Travel
InterGlobe Aviation

More Telugu News