Harish Rao: 'తాగుబోతుల తెలంగాణ'గా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు: హరీశ్ రావు

Harish Rao criticizes Revanth Reddy for turning Telangana into a state of drunkards
  • రెండేళ్ల కాంగ్రెస్ పాలన పూర్తిగా విఫలమైందని హరీశ్ రావు విమర్శ
  • రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
  • ఫార్మా సిటీ, మెట్రో వంటి ప్రాజెక్టులను రద్దు చేశారని ఆరోపణ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు మొండి చేయి చూపిందని, పాలన పూర్తిగా ఆగమాగంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పూర్తిస్థాయి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని... నిరూపించలేకపోతే రాజీనామాకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? అని సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రెండేళ్ల పాలన అనేది ప్రభుత్వ పనితీరుకు గీటురాయిలాంటిదని, కానీ ఈ ప్రభుత్వం నిస్సారంగా, నిరర్థకంగా మిగిలిపోయిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. "ఈ రెండేళ్లలో ఆత్మస్తుతి, పరనింద తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు. మా ప్రభుత్వం రాగానే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు తెచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా దర్బార్ కూడా ఇప్పుడు అమలు కావడం లేదు. కేసీఆర్ తెచ్చిన మెట్రో రైలు, ఫార్మా సిటీ వంటి కీలక ప్రాజెక్టులను రద్దు చేయడం మినహా వీరేమీ చేయలేదు" అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం కూడా పూర్తిగా తగ్గిపోయిందని ఆరోపించారు.

రైతుల సమస్యలపై హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. "మక్కలు కొని 50 రోజులు దాటినా రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. రైతులకు బేడీలు వేసిన ఈ ప్రభుత్వం రైతు సంక్షోభ ప్రభుత్వం. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మద్యం దుకాణాలకు నోటిఫికేషన్లు ఇచ్చి రాష్ట్రాన్ని 'తాగుబోతుల తెలంగాణ'గా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు" అని విమర్శించారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు అడిగితే విజిలెన్స్, ఏసీబీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.

గ్లోబల్ సమ్మిట్‌ను "గోబెల్స్ సమ్మిట్" అని ఎద్దేవా చేశారు. "గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బీఆర్ఎస్ హయాంలో సమీకరించినదే. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదు" అని అన్నారు. కేసీఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన "పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉంది" అని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు.
Harish Rao
Revanth Reddy
Telangana
BRS
Congress
Telangana government
loan waiver
farmers issues
liquor shops
Global Summit

More Telugu News