Avi Loeb: మన సౌర వ్యవస్థలో వింత తోకచుక్క.. అది గ్రహాంతరవాసుల 'సీడ్ షిప్' అంటున్న హార్వర్డ్ శాస్త్రవేత్త!

3I ATLAS Comet Sparks Debate Alien Seed Ship Says Avi Loeb
  • సౌరవ్యవస్థలో కలకలం రేపుతున్న 3I/ATLAS తోకచుక్క 
  • వింత ప్రవర్తనతో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని మిస్టరీ
  • భూమిపైకి గ్రహాంతర జీవం ఎప్పుడో చేరి ఉండొచ్చన్న శాస్త్రవేత్త లోబ్
మన సౌరవ్యవస్థ గుండా ప్రయాణిస్తున్న ఓ గ్రహాంతర తోకచుక్క ఇప్పుడు శాస్త్రవేత్తలను తీవ్రంగా ఆశ్చర్యపరుస్తోంది. ఇది సాధారణ తోకచుక్క కాదని, భూమి లాంటి గ్రహాలపై జీవాన్ని సృష్టించేందుకు ఓ ఉన్నత నాగరికత ఉద్దేశపూర్వకంగా పంపిన 'సీడ్ షిప్' (జీవ బీజ నౌక) కావచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఏవీ లోబ్ సంచలన వాదన వినిపిస్తున్నారు.

3I/ATLAS అనే ఈ తోకచుక్క ప్రవర్తన చాలా వింతగా ఉంది. సాధారణంగా తోకచుక్కల తోక సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది. కానీ దీని తోక సూర్యుడి వైపు ఉండటం, దాని రసాయన కూర్పు, ప్రయాణించే తీరు శాస్త్రవేత్తలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఈ అసాధారణ లక్షణాల వల్లే దీని వెనుక ఏదైనా టెక్నాలజీ ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

"విశ్వంలో మనకంటే ముందు ఎన్నో నాగరికతలు పుట్టి ఉండొచ్చు. వాటిలో ఏదైనా ఒక 'అంతరిక్ష తోటమాలి' (Interstellar Gardener) ఉద్దేశపూర్వకంగా భూమిపై జీవానికి బీజం వేసి ఉండొచ్చు" అని ఏవీ లోబ్ వ్యాఖ్యానించారు. కోట్లాది సంవత్సరాలుగా ఇలాంటి గ్రహాంతర వస్తువులు భూమిని ఢీకొడుతూనే ఉన్నాయని, వాటిలో కొన్నింటిలోనైనా అంతరిక్ష ప్రయాణాన్ని తట్టుకోగల సూక్ష్మజీవులు ఉంటే, భూమిపైకి గ్రహాంతర జీవం ఎప్పుడో చేరి ఉండొచ్చని ఆయన తన బ్లాగ్‌లో వివరించారు.

మన సూర్యుడి కంటే బిలియన్ల సంవత్సరాల ముందే గెలాక్సీలో చాలా నక్షత్రాలు ఏర్పడ్డాయని, కాబట్టి ఇతర నాగరికతలకు అభివృద్ధి చెందడానికి చాలా సమయం దొరికిందని లోబ్ వాదిస్తున్నారు. అయితే, ఈ వాదన చాలా సాహసోపేతమైనది కావడంతో ప్రముఖ శాస్త్రవేత్తలు ఆచితూచి స్పందిస్తున్నారు. ఏదేమైనా, 3I/ATLAS తోకచుక్క ప్రవర్తన మాత్రం విశ్వం గురించి సరికొత్త చర్చలకు దారితీస్తోంది.
Avi Loeb
3I ATLAS
Oort cloud
interstellar object
seed ship
extraterrestrial life
alien technology
Harvard University
comet
space

More Telugu News