Raipur-Visakhapatnam Corridor: రాయ్‌పూర్-విశాఖ కారిడార్... 12 గంటల ప్రయాణం ఇక 5 గంటల్లోనే!

Raipur Visakhapatnam Corridor Travel in 5 Hours
  • రాయ్‌పూర్-విశాఖ మధ్య 7 గంటల ప్రయాణ సమయం ఆదా
  • ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీలను కలుపుతున్న 6 వరుసల రహదారి
  • విశాఖ పోర్టుకు పెరగనున్న కనెక్టివిటీ.. ఎగుమతులకు ఊతం
  • భారీగా పెరిగిన భూముల ధరలు.. రైతుల్లో ఆనందం
రాయ్‌పూర్-విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, మూడు రాష్ట్రాల వాణిజ్య రూపురేఖలను మార్చేలా నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే, 12 గంటల ప్రయాణ సమయం కేవలం 5 గంటలకు తగ్గనుంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా సాగే ఈ ఆరు వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే.. వాణిజ్య, పారిశ్రామిక వర్గాలతో పాటు సామాన్యులు, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.

మొత్తం రూ. 16,482 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ 465 కిలోమీటర్ల కారిడార్‌ను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి-26 మార్గంలో 597 కిలోమీటర్ల దూరం ఉండగా, ఈ కొత్త మార్గం ద్వారా 132 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇది ఇంధన ఆదాతో పాటు రవాణా ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ కారిడార్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పరిశ్రమలు నేరుగా విశాఖపట్నం పోర్టుకు, చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానమవుతాయి. ఫలితంగా ఎగుమతులు వేగవంతమై, లాజిస్టిక్స్ రంగం బలోపేతం అవుతుంది.

ఈ ప్రాజెక్టు స్థానిక రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెస్తోంది. "గతంలో మా భూమి ఎకరం రూ. 15 లక్షలు పలికేది. ఈ హైవే పనులు మొదలయ్యాక దాని విలువ రూ. 1.5 కోట్లకు చేరింది. ఇక్కడి రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు" అని ఓ రైతు ఆనందం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా జామి గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే మరో రైతు మాట్లాడుతూ.. "హైవే కోసం 1.10 ఎకరాల భూమి ఇచ్చాను. నాకు మంచి పరిహారం అందింది. మిగిలిన భూమి విలువ కూడా గణనీయంగా పెరిగింది" అని తెలిపారు.

ట్రక్కు యజమాని విశాల్ మాట్లాడుతూ.. "గతంలో రాయ్‌పూర్ నుంచి విశాఖకు వెళ్లాలంటే ఒకటిన్నర రోజులు పట్టేది. ఇప్పుడు పగలు బయలుదేరితే రాత్రికే గమ్యం చేరుకోవచ్చు. డీజిల్ ఖర్చు, వాహనాల నిర్వహణ భారం తగ్గుతుంది" అని వివరించారు. ఈ కారిడార్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీలోని మారుమూల, గిరిజన ప్రాంతాలైన కంకేర్, కోరాపుట్, అరకు, రామభద్రపురం వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.
Raipur-Visakhapatnam Corridor
Raipur
Visakhapatnam
Economic Corridor
Greenfield Highway
Chhattisgarh
Odisha
Andhra Pradesh
Highway Project
Logistics

More Telugu News