Goa Nightclub Fire: గోవా విషాదం... కారణాలు ఇవేనా?

Goa Nightclub Fire Kills 25 Due to Negligence
  • గోవా నైట్‌క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం, 25 మంది మృతి
  • అక్రమ నిర్మాణం, ఇరుకైన దారులే ప్రమాదానికి కారణమా?
  • ఘటనా స్థలానికి ఆలస్యంగా చేరుకున్న అగ్నిమాపక శకటాలు
  • గతంలోనే కూల్చివేత నోటీసులు జారీ చేసిన పంచాయతీ
గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ఘోర విషాదానికి క్లబ్ యాజమాన్యం నిర్లక్ష్యం, అక్రమ నిర్మాణం, ఇరుకైన దారులే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. పంచాయతీ అధికారులు గతంలోనే కూల్చివేత నోటీసులు ఇచ్చినా, వాటిని బేఖాతరు చేసి క్లబ్ నిర్వహించడమే మరణాల తీవ్రతకు దారితీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని అర్పొర గ్రామంలో ఉన్న 'బిర్చ్ బై రోమియో లేన్' నైట్‌క్లబ్‌లో శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 'బాలీవుడ్ బ్యాంగర్ నైట్' జరుగుతున్న సమయంలో సుమారు 100 మంది క్లబ్‌లో ఉన్నారు. డ్యాన్స్ ఫ్లోర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. కొందరు బయటకు పరుగులు తీయగా, ప్రాణాలు కాపాడుకునేందుకు మరికొందరు కింద ఉన్న వంటగదిలోకి వెళ్లారు. కానీ అదే వారికి మృత్యుద్వారంగా మారింది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక క్లబ్ సిబ్బందితో పాటు పర్యాటకులు అక్కడే ప్రాణాలు విడిచారు.

ఇరుకైన దారి, తాటాకులతో నిర్మాణాలు..!

ఈ క్లబ్‌కు వెళ్లే దారి చాలా ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి సుమారు 400 మీటర్ల దూరంలోనే నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని ఫైర్ ఆఫీసర్ ఒకరు తెలిపారు. తాత్కాలికంగా తాటాకులతో నిర్మించిన కట్టడాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని హైదరాబాద్‌కు చెందిన ప్రత్యక్ష సాక్షి ఫాతిమా షేక్ తెలిపారు. 

మరోవైపు, ఈ క్లబ్ నిర్మాణం పూర్తిగా అక్రమమని, భాగస్వాముల మధ్య వివాదాలు కూడా ఉన్నాయని అర్పొర-నగోవా సర్పంచ్ రోషన్ రెడ్కర్ వెల్లడించారు. తాము కూల్చివేత నోటీసులు జారీ చేసినా, పంచాయతీ డైరెక్టరేట్ అధికారులు ఆ చర్యలను నిలిపివేశారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గోవాకు ఇది అత్యంత బాధాకరమైన రోజని పేర్కొన్న సీఎం ప్రమోద్ సావంత్, ఘటనపై విచారణకు ఆదేశించారు. మృతుల్లో పర్యాటకులు, క్లబ్ సిబ్బంది ఉండగా, కొన్ని మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉంది.
Goa Nightclub Fire
Goa
Nightclub
Fire Accident
Arpora
Pramod Sawant
Narendra Modi
India
Nightclub Tragedy

More Telugu News