DK Shivakumar: ఐపీఎల్ మ్యాచ్ లను చిన్నస్వామి స్టేడియం నుంచి తరలించేందుకు అనుమతించం: డీకే శివకుమార్

DK Shivakumar Says IPL Matches Will Not Be Moved From Chinnaswamy Stadium
  • చిన్నస్వామి స్టేడియం వద్ద కిందటి సీజన్ లో తొక్కిసలాట... 11 మంది మృతి
  • చిన్నస్వామి వేదికగా ఈసారి ఐపీఎల్ పోటీలు జరగకపోవచ్చని వార్తలు
  • ఇది బెంగళూరు, కర్ణాటక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమన్న శివకుమార్ 
  • భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని భరోసా
  • బెంగళూరులో మరో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని హామీ
ఐపీఎల్ మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి తరలించే ప్రసక్తే లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఇది బెంగళూరు, కర్ణాటక ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని ఆయన అన్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

"నేను కూడా క్రికెట్ అభిమానినే. చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం. స్టేడియం ప్రతిష్ఠను కాపాడతాం" అని డీకే శివకుమార్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా, బెంగళూరులో ప్రత్యామ్నాయంగా మరో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు.

కిందటి సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవాలు తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో, 2026 సీజన్ లో ఐపీఎల్ మ్యాచ్ లు చిన్నస్వామి స్టేడియంలో జరగకకపోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరోవైపు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం మారితే, జట్టు హోం గ్రౌండ్‌పై ఏమైనా ప్రభావం పడుతుందేమోనన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. 
DK Shivakumar
IPL matches
Chinnaswamy Stadium
Karnataka
Royal Challengers Bangalore
RCB
Cricket stadium
KSC
Bengaluru
IPL 2026

More Telugu News