Indigo Airlines: రూ.610 కోట్ల రిఫండ్ లు చెల్లించిన ఇండిగో

Indigo Refunds Rs 610 Crore Before Deadline
  • ఇండిగో సంక్షోభంపై రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం
  • ప్రయాణికులకు రూ. 610 కోట్లు వాపస్ చేసిన ఇండిగో
  • విమాన టికెట్ల ధరలపై పరిమితులు విధిస్తూ ఉత్తర్వులు
  • రీషెడ్యూలింగ్ విమానాలకు అదనపు ఛార్జీలు రద్దు
  • క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్న విమాన సేవలు
విమానయాన సంస్థ ఇండిగో ఎదుర్కొంటున్న కార్యకలాపాల సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కఠినంగా వ్యవహరించింది. రద్దయిన లేదా తీవ్రంగా ఆలస్యమైన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు చెల్లించాల్సిన రిఫండ్‌లను ఆదివారం రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు ఇండిగో ఇప్పటివరకు సుమారు రూ. 610 కోట్లను ప్రయాణికులకు రిఫండ్ చేసినట్లు మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

విమానాల రద్దు కారణంగా తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకునే వారి నుంచి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయాణికులకు తక్షణమే సహాయం అందించేందుకు, రిఫండ్, రీబుకింగ్ సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేందుకు ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

ప్రభుత్వ జోక్యంతో ఇండిగో పనితీరు క్రమంగా మెరుగుపడుతోందని, విమానాల షెడ్యూల్స్ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం 706 విమానాలు నడపగా, శనివారానికి ఆ సంఖ్య 1,565కు పెరిగింది. ఆదివారం చివరి నాటికి 1,650కి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇతర దేశీయ విమానయాన సంస్థల కార్యకలాపాలు సజావుగా పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయని తెలిపింది.

ఇండిగో విమానాల రద్దుతో పెరిగిన డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని టికెట్ ధరలు అమాంతం పెరగడంతో, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ధరలపై పరిమితి విధించింది. ఈ చర్యతో ప్రభావిత మార్గాల్లో ఛార్జీలు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. అదేవిధంగా, ప్రయాణికుల నుంచి వేరుపడిన లగేజీని 48 గంటల్లోగా గుర్తించి అందజేయాలని ఆదేశించగా, శనివారం నాటికి 3,000 బ్యాగులను ఇండిగో డెలివరీ చేసింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా ప్రధాన విమానాశ్రయాల్లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్లు ధృవీకరించారు.

ప్రభుత్వ వేగవంతమైన చర్యలతో దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలు వేగంగా స్థిరపడుతున్నాయని, పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
Indigo Airlines
Indigo
Flight Cancellations
Refunds
Aviation Ministry
Air Travel
Ticket Prices
Flight Operations
DGCA
Civil Aviation

More Telugu News