Goa Nightclub Fire: క్లబ్ ను కూల్చివేయాలని గతంలోనే నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు!

Goa Nightclub Fire Notices Ignored Before Tragedy
  • గోవా క్లబ్ అగ్నిప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి
  • ఇరుకైన మార్గాలు.. తాటాకులతో అలంకరణ వల్ల పెరిగిన ప్రమాద తీవ్రత
  • ప్రమాద సమయంలో డ్యాన్స్ ఫ్లోర్ పై వంద మందికి పైగా జనం
గోవాలోని ‘బర్చ్‌ బై రోమియో లేన్‌’ నైట్‌ క్లబ్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది సజీవ సమాధి అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం భారీగా జరగడానికి కారణం క్లబ్ పరిసరాలేనని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్లబ్ లోకి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండడంతో పాటు అలంకరణ కోసం క్లబ్ ముందు ఏర్పాటు చేసిన తాటాకుల వల్ల మంటలు వేగంగా విస్తరించాయని చెబుతున్నారు.

క్లబ్ నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గతంలో క్లబ్ ను పరిశీలించిన అధికారులు.. పరిసరాలను గమనించి ఆ ఏరియాలో క్లబ్ నిర్వహణకు అనుకూలం కాదని, వెంటనే క్లబ్ ను మూసేయాలని నోటీసులు కూడా జారీ చేశారని సమచారం. అయితే, ఈ నోటీసులను లెక్కచేయకుండా క్లబ్ ను నడపడం వల్ల తాజాగా జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం ఎక్కువైందని అధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పటికీ ఇరుకైన మార్గాల కారణంగా మంటలు ఆర్పడంలో ఆలస్యం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

అర్ధరాత్రి తర్వాత భారీ శబ్దం..
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. శనివారం క్లబ్ కోలాహలంగా ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1 గంట ప్రాంతంలో డ్యాన్స్ ఫ్లోర్ పై వంద మందికి పైగా డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఆపై మంటలు ఎగిసిపడడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. జనం భయాందోళనతో పరుగులు తీశారు. ఇంతలోనే మంటలు క్లబ్‌ అంతటా వ్యాపించాయి. పొగ కారణంగా బయటకు వెళ్లే మార్గం కనిపించక చాలామంది మరణించారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో క్లబ్‌ నిర్వాహకులపై చర్యలు చేపట్టినట్లు గోవా సీఎం ప్రమోద్‌ సావంత్ తెలిపారు. ఇప్పటికే మేనేజర్‌ను అరెస్టు చేయగా.. క్లబ్ యజమానులపై అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


క్లబ్ ముందున్న తాటాకుల అలంకరణ.. వీటి కారణంగానే మంటలు వేగంగా వ్యాపించాయి

Goa Nightclub Fire
Goa
Nightclub
Fire Accident
Pramod Sawant
Club Romeo Lane
Fire Safety
Building Codes
Nightclub Safety
India

More Telugu News