Revanth Reddy: కేసీఆర్‌కు కేటీఆరే పెద్ద గుదిబండ: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Says KTR is Big Burden for KCR
  • తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపామన్న సీఎం రేవంత్ రెడ్డి
  • ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం
  • దేవరకొండ అభివృద్ధికి పలు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి
  • పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసేవారినే గెలిపించాలని పిలుపు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక రంగాల్లో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరి ఉత్పత్తి, శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి నిర్మూలనలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, త్వరలోనే విద్య, వైద్య రంగాల్లోనూ ఇదే స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఆయన పాల్గొని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా, ఆయన కుటుంబంపైనా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల అప్పులపాలు చేసింది. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకున్నారు. బీఆర్ఎస్‌కు కేటీఆరే అతిపెద్ద గుదిబండ. ఆయన ఉన్నంతకాలం ఆ పార్టీని ప్రజలు బండకేసి కొడుతూనే ఉంటారు" అని వ్యాఖ్యానించారు. గతంలో మంత్రులను సైతం ఇంట్లోకి రానివ్వని కేసీఆర్, ఇప్పుడు ఇద్దరు సర్పంచ్‌లను పక్కన పెట్టుకుని మంచి రోజులు వస్తాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు. తాము ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో ఓట్లు అడుగుతామని, బీఆర్ఎస్ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చిన చోట మాత్రమే ఓట్లు అడగాలని అన్నారు. తమ ప్రభుత్వం రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తోందని తెలిపారు.

నల్లగొండ జిల్లాకు జీవనాడి అయిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు నిర్లక్ష్యం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము పనులు ప్రారంభిస్తే ప్రమాదం జరిగినప్పుడు కేసీఆర్, హరీశ్ రావు ఆనందపడ్డారని మండిపడ్డారు. ఎవరు అడ్డుపడినా ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. దేవరకొండ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి చేసే కాంగ్రెస్ మద్దతుదారులనే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Revanth Reddy
Telangana
KCR
KTR
BRS Party
Congress
SLBC Project
Double Bedroom Houses
Indiramma Houses
Nalgonda

More Telugu News