Tirupati Sanskrit University: తిరుపతి సంస్కృత వర్సిటీలో కీచక పర్వం.. విద్యార్థినిపై ఇద్దరు ప్రొఫెసర్ల అఘాయిత్యం

Tirupati Sanskrit University Professors Accused of Sexual Assault
  • బాధితురాలిని గర్భవతిని చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్
  • దృశ్యాలు చిత్రీకరించి వేధించిన మరో ఆచార్యుడు
  • ఇద్దరు ప్రొఫెసర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వీసీ
  • ఒక ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు వేసిన వర్సిటీ యాజమాన్యం
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బీఈడీ చదువుతున్న విద్యార్థినిపై ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగికదాడికి పాల్పడగా, మరో ప్రొఫెసర్ ఆ దృశ్యాలను వీడియో తీసి వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ దాడిలో బాధితురాలు గర్భం దాల్చడంతో విషయం బయటపడింది.

వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణకుమార్ కొంతకాలంగా మొదటి సంవత్సరం విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థినితో ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్‌రెడ్డి తన ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోను చూపించి, బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

వేధింపులు భరించలేక, బాధితురాలు పది రోజుల క్రితమే వర్సిటీ వీసీ కృష్ణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు యూనివర్సిటీ అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మణకుమార్‌ను డిసెంబర్ 1న సస్పెండ్ చేసింది.

ఈ ఘటనపై పూర్తి ఆధారాలతో వర్సిటీ ఇన్‌చార్జి వీసీ రజనీకాంత్‌ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఇద్దరు ప్రొఫెసర్ల సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు. ఈ ఘటనతో విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కీచక ప్రొఫెసర్ల తీరుపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tirupati Sanskrit University
Lakshman Kumar
Sanskrit University
Sanskrit University harassment
Shekhar Reddy
Tirupati
sexual assault
Andhra Pradesh
student harassment
Krishna Murthy

More Telugu News