Ravikumar: పరకామణి కేసు నిందితుడు కన్నీటి పర్యంతం.. మహాపాపం చేశానంటూ వీడియో విడుదల

Ravikumar Parakamani Case Accused Releases Video Apologizing
  • తాను చేసింది చిన్న చోరీ కాదని, మహాపాపమన్న రవికుమార్
  • ప్రాయశ్చిత్తంగా 90 శాతం ఆస్తులు శ్రీవారికి ఇస్తానని ప్రకటన
  • తనను ఎవరూ బెదిరించి ఆస్తులు రాయించుకోలేదని స్పష్టీకరణ
  • అసభ్య ప్రచారాలతో కుటుంబం కుంగిపోతోందంటూ ఆవేదన
తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ తాను పెద్ద తప్పు చేశానంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రవికుమార్ చేసింది 'చిన్న చోరీ' అంటూ మాజీ సీఎం జగన్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఆయన స్వయంగా 'మహాపాపం' అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

2023 ఏప్రిల్ 29న పరకామణిలో తాను మహాపాపం చేశానని, ఆ తప్పును తలుచుకుని తానూ, తన భార్యాపిల్లలు బాధపడని రోజు లేదని రవికుమార్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్, స్థిరాస్తి వ్యాపారాలు చేసిన తాను, ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90 శాతాన్ని శ్రీవారికి రాసిచ్చానని కన్నీటితో తెలిపారు. ఏడాదిగా అజ్ఞాతంలో ఉన్న రవికుమార్, ఇటీవల హైకోర్టు ఆదేశాలతో సీఐడీ విచారణకు హాజరైన తర్వాత ఈ వీడియోను విడుదల చేశారు.

కొందరు తనను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రవికుమార్ స్పష్టం చేశారు. అయితే, కొందరు తనను బ్లాక్‌మెయిల్ చేసిన మాట వాస్తవమేనని, వారిపై కేసులు కూడా పెట్టానని తెలిపారు. తన ప్రైవేటు భాగాల్లో శస్త్రచికిత్సలు చేయించుకుని నగదు దాచినట్లు మూడేళ్లుగా జరుగుతున్న అసభ్య ప్రచారంతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోందని వాపోయారు. న్యాయస్థానం ఆదేశిస్తే ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధమేనని చెబుతూ కంటతడి పెట్టారు. 

Ravikumar
Tirumala
Parakamani
Theft case
Sri Vari Temple
TTD
Andhra Pradesh
Jagan Mohan Reddy
CID investigation
Blackmail

More Telugu News