S Jaishankar: డిసెంబర్ 10 నుంచి... భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు

India US Trade Talks Begin December 10
  • ఢిల్లీలో జరగబోయే చర్చల్లో అమెరికా డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్
  • 50 శాతం సుంకాలు విధించిన తర్వాత చర్చలు జరగడం ఇది రెండోసారి
  • ఈ నెలాఖరు నాటికి వాణిజ్య చర్చలు పూర్తి కావాలని ఇరుదేశాల నిర్ణయం
భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం శనివారం వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు డిసెంబర్ 10న ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ చర్చల్లో మొదటి విడత ఒప్పందంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

ఢిల్లీలో జరగబోయే ఈ చర్చలకు అమెరికా తరఫున హాజరవుతున్న బృందంలో డిప్యూటీ ట్రేడ్ రిప్రజెంటేటివ్ రిక్ స్విజ్జర్ పాల్గొంటున్నారు.

భారత్ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన తర్వాత వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరగడం ఇది రెండోసారి. చివరిసారి అమెరికా ప్రతినిధులు సెప్టెంబరు 16న భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత సెప్టెంబర్ 22న వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బృందం చర్చల కోసం అమెరికాకు వెళ్లింది.

త్వరలో అమెరికాతో తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ఇటీవల తెలిపారు. భారత ఎగుమతిదారులకు లబ్ధి చేకూరేలా సుంకాలను ప్రస్తావిస్తామని ఆయన వెల్లడించారు. టారిఫ్‌ల సమస్యను పరిష్కరించేందుకు ఒకసారి, పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం దిశగా మరో విడత చర్చలు ఉంటాయని తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి వాణిజ్య చర్చలు పూర్తి చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
S Jaishankar
India US trade deal
India United States trade
Piyush Goyal
Rick Switzer
Rajesh Agarwal

More Telugu News