YS Sharmila: ఈ సమావేశాల్లో కూడా ఎంపీలు బుద్ధిమంతులుగా కూర్చుంటున్నారు: షర్మిల

YS Sharmila Slams AP MPs for Inaction in Parliament
  • రాష్ట్ర ఎంపీలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం
  • పార్లమెంటులో రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడటం లేదని విమర్శ
  • ఎంపీలు మోదీకి రబ్బర్ స్టాంపుల్లా మారారని ఆరోపణ
  • ఇప్పటికైనా విభజన హామీలపై నోరు విప్పాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరు మెదపకుండా, బీజేపీకి బినామీలుగా, మోదీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీల వైఖరిపై ఆమె మండిపడ్డారు.

షర్మిల స్పందిస్తూ, "రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా, విభజన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. పార్లమెంటులో మన ఎంపీలు బుద్ధిమంతుల్లా కూర్చుంటున్నారు. మోదీ మాట్లాడితే చప్పట్లు కొట్టడానికి పోటీ పడుతున్నారు. వారికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. పేరుకు వేర్వేరు పార్టీల ఎంపీలు అయినా, వారంతా బీజేపీకి రబ్బర్ స్టాంపుల్లా మారిపోయారు. బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు గొర్రెల్లా తలలూపడం తప్ప వారికి ఏమీ చేతకావడం లేదు" అని విమర్శించారు.

విభజన హామీలను ప్రజలకు ఇచ్చిన చెక్కుతో పోల్చిన షర్మిల, "2014 నాటికే విభజన హామీల విలువ రూ. 5 లక్షల కోట్లు. ఆ చెక్కు మన చేతిలో ఉన్నా, దాన్ని ఎన్‌క్యాష్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం. పోలవరం ఎత్తును 41 మీటర్లకే పరిమితం చేస్తున్నా, అమరావతికి కేంద్రం సాయం చేయలేదని పార్లమెంటరీ కమిటీ చెప్పినా, మన ఎంపీలు మౌనంగా ఉండి గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నారు" అని ఎద్దేవా చేశారు.

"రాష్ట్రంలో 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు... మీరు నిజంగా తెలుగు బిడ్డలే అయితే, మీలో ప్రవహించేది తెలుగువాడి రక్తమే అయితే, మీకు ఓట్లు వేసిన ప్రజల మీద కృతజ్ఞత ఉంటే, ఇప్పటికైనా విభజన హామీలపై నోరు విప్పండి. ప్రధాని మోదీ మోసాలను పార్లమెంటు వేదికగా నిలదీయండి" అని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.
YS Sharmila
Andhra Pradesh
AP MPs
Narendra Modi
Parliament
Bifurcation promises
Polavaram project
Amaravati
BJP
AP Congress

More Telugu News