Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారాలి: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Parents should Change Mindset on Government Schools
  • ప్రభుత్వ పాఠశాలలపై చిన్నచూపు వద్దన్న లోకేశ్
  • 2029 నాటికి ఏపీ విద్యావ్యవస్థను దేశంలోనే నెం.1గా తీర్చిదిద్దుతామన్న లోకేశ్
  • విద్యతో పాటు నైతిక విలువల బోధనకు అధిక ప్రాధాన్యం
  • బడిని బలోపేతం చేసేందుకు మెగా పీటీఎం కార్యక్రమాలు
  • పాఠశాలల అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం అవసరమని స్పష్టం
ప్రభుత్వ పాఠశాలల పట్ల సమాజంలో, ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఉన్న చిన్నచూపు ధోరణి మారాలని, వారి మైండ్‌సెట్ మారినప్పుడే విద్యావ్యవస్థ బలోపేతం అవుతుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. పాఠశాలల్లో రాజకీయాలకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేసిన ఆయన, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం భామినిలోని ఏపీ మోడల్ స్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన 'మెగా పీటీఎం 4.0' కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "ప్రభుత్వ బడులపై కొంతమందికి చిన్నచూపు ఉంది. ఆ ఆలోచనా ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాబోయే మూడేళ్లలో 'ఏపీ మోడల్ ఎడ్యుకేషన్' సాధించాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగా, టెక్నాలజీని జోడించి మెరుగైన విద్యను అందిస్తాం. 2029 కల్లా రాష్ట్ర విద్యారంగాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటా" అని ధీమా వ్యక్తం చేశారు. 

దేశ భవిష్యత్తు తరగతి గది నుంచే రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తారని లోకేశ్ తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు, ప్రజాప్రతినిధులు అందరినీ బడితో అనుసంధానం చేయాలనే లక్ష్యంతోనే 'మెగా పీటీఎం' కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. బాపట్ల, సత్యసాయి జిల్లాల తర్వాత ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యపై సమానంగా దృష్టి సారించామని వివరించారు.

విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు కూడా ఎంతో ముఖ్యమని లోకేశ్ నొక్కిచెప్పారు. "పిల్లల భవిష్యత్తుకు చదువు ఒక్కటే సరిపోదు, నైతిక విలువలు చాలా అవసరం. అందుకే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువల సలహాదారుగా నియమించాం. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పుస్తకాలు రూపొందిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి పిల్లలకు నైతిక విలువలపై పాఠాలు చెబుతున్నాం" అని తెలిపారు. ఇటీవల పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతదినోత్సవ వేడుకల్లో వేలాది మంది విద్యార్థులు చూపిన క్రమశిక్షణ, పరిశుభ్రతను స్ఫూర్తిగా తీసుకుని మన పాఠశాలలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, ప్రముఖ కథా రచయిత కీ.శే. కాళీపట్నం రామారావు (కారా) మాస్టారు చెప్పిన 'సామాజిక రుణం' అనే మాటను లోకేశ్ గుర్తుచేశారు. "మనం తల్లి, తండ్రి, గురువు రుణాలతో పాటు సమాజ రుణం కూడా తీర్చుకోవాలి. మనమంతా కలిసి బడిని బాగుచేయడం ద్వారా ఆ సామాజిక రుణం తీర్చుకుందాం" అని ఆయన పిలుపునిచ్చారు.
Nara Lokesh
AP Model School
Andhra Pradesh Education
Government Schools
Mega PTM 4.0
Education System
Chandrababu Naidu
Moral Values
Kali Patna Ramarao
Parvathipuram Manyam District

More Telugu News