Pawan Kalyan: ఒక్కోసారి ఉపాధ్యాయులను చూస్తే నాకు బాధేస్తుంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan Emphasizes Respect for Teachers at Chilakaluripeta Meeting
  • చిలకలూరిపేటలో పేరెంట్-టీచర్స్ మీటింగ్‌కు హాజరైన పవన్ కల్యాణ్
  • ఉపాధ్యాయులు దైవసమానులని, వారిని గౌరవించాలని సూచన
  • ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి
  • పాఠశాలకు 25 కంప్యూటర్లతో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని హామీ
  • 'డొక్కా సీతమ్మ' మధ్యాహ్న భోజన పథకంతో నాణ్యమైన ఆహారం అందిస్తున్నామన్న పవన్
"ఉపాధ్యాయులను చూస్తే ఒక్కోసారి నాకు బాధేస్తుంది. ఇంట్లో ఇద్దరు బిడ్డలుంటేనే, వారిని స్కూలుకు పంపితే కాసేపు ప్రశాంతంగా ఉంటుందని తల్లిదండ్రులు అనుకుంటారు. అలాంటిది, ఒకే గదిలో అంతమంది పిల్లల అల్లరిని భరిస్తూ, వారిని క్రమశిక్షణలో పెడుతూ పాఠాలు చెప్పాలంటే ఉపాధ్యాయులు ఎంత అలసిపోతారో ఆలోచించండి" అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విద్యార్థులు తమ గురువుల కష్టాన్ని అర్థం చేసుకోవాలని, వారి పట్ల గౌరవంగా మెలగాలని సూచించారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ - టీచర్స్ మీటింగ్ (ఆత్మీయ సమావేశం)లో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఉపాధ్యాయులు కొన్నిసార్లు విసుక్కుంటారు, అవసరమైతే చిన్న దెబ్బ వేస్తారు. మనం వారి చేత దెబ్బ కొట్టించుకోకుండా వినయంగా ఉంటే, వాళ్ళకి సగం బరువు తగ్గించినవాళ్లం అవుతాం. జీవితంలో ఉన్నత స్థానానికి రావాలంటే గురువుల దీవెనలు ఎంతో అవసరం" అని విద్యార్థులకు హితవు పలికారు.

తల్లిదండ్రుల తర్వాత విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయులదే కీలక స్థానమని, అలాంటి గురువులు దైవసమానులని కొనియాడారు. ఆడపిల్లలను కొంతవరకే చదివించి పెళ్లి చేసేయాలనే ఆలోచనను తల్లిదండ్రులు వీడాలని సూచించారు. జుబేదా, రిహానా వంటి చిన్నారుల మేధస్సు దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించాలని కోరారు.

శారీరక దారుఢ్యానికి వ్యాయామం ఎంత అవసరమో, మానసిక దారుఢ్యానికి పుస్తకాలు చదవడం కూడా అంతే ముఖ్యమని పవన్ కల్యాణ్ నొక్కిచెప్పారు. "Books are the training weights for your mind. ఒక లక్షమంది మెదళ్లను కదిలించే శక్తి చదువుకు ఉంది" అని వ్యాఖ్యానించారు. ఇటీవల పిఠాపురం స్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన చిన్న గొడవను కొందరు రాజకీయ లబ్ధి కోసం కుల గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, అందుకే పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం చాలా అవసరమని స్పష్టం చేశారు.

ఆడపిల్లలకు చదువుతో పాటు ఆత్మరక్షణ విద్యలు కూడా అవసరమని, మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న ఉపాధ్యాయురాలు గౌస్యను ప్రత్యేకంగా అభినందించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, బలవర్థకమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాదు, పాఠశాలకు గది నిండా పుస్తకాలు, 25 కంప్యూటర్లతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Pawan Kalyan
Pawan Kalyan speech
Chilakaluripeta
Teachers meeting
Education
Student teacher relationship
School education
Andhra Pradesh education
Parent teacher meeting
Digital library

More Telugu News