IndiGo: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 'ఇండిగో' గందరగోళం... ఒక్కరోజే 92 విమానాల రద్దు

Chaos continues at Hyderabad Airport as IndiGo cancels 92 flights
  • శంషాబాద్ విమానాశ్రయంలో కొనసాగుతున్న ఇండిగో సేవల అంతరాయం
  • ఇవాళ‌ ఒక్కరోజే 92 విమాన సర్వీసులను రద్దు చేసిన సంస్థ
  • ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో సిబ్బందితో ప్రయాణికుల తీవ్ర వాగ్వాదం
  • చిక్కుకుపోయిన అయ్యప్ప భక్తులు... రంగంలోకి దిగిన ఏపీ మంత్రి
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల రద్దుతో నెలకొన్న గందరగోళం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజైన శుక్రవారం కూడా ఇండిగో ఏకంగా 92 విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఎయిర్‌పోర్ట్ ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు రద్దు చేసిన విమానాల్లో 43 రాకపోకలు, 49 బయలుదేరే సర్వీసులు ఉన్నాయి. గత నాలుగు రోజుల్లో ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం ఇదే తొలిసారి. నిన్న‌ 74 విమానాలను రద్దు చేసిన ఇండిగో, ఈ నెల‌ 2 నుంచి ఇప్పటివరకు మొత్తం 220 సర్వీసులను నిలిపివేసింది.

ఈ వరుస రద్దులతో విసిగిపోయిన ప్రయాణికులు టెర్మినల్ భవనంలో ఆందోళనకు దిగారు. ఇండిగో సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగి, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. చెక్-ఇన్ ప్రక్రియ పూర్తయ్యాక విమానాలను రద్దు చేస్తున్నారని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బంది అందుబాటులో లేనప్పుడు విమానాలను ఎందుకు షెడ్యూల్ చేస్తున్నారని ప్రశ్నిస్తూ, "షేమ్ షేమ్" అంటూ నినాదాలు చేశారు.

ముఖ్యంగా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారు. వారు "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ నినాదాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో విజయవాడ వెళ్లేందుకు వచ్చిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, అయ్యప్ప భక్తుల సమస్యపై స్పందించారు. ఆయన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి, ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, తన విమానాన్ని అందుకోలేకపోయిన మంత్రి పార్థసారథి, చివరకు రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు.

మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా 8 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలకు సర్వీసులు నిలిచిపోవడంతో అక్కడ కూడా ప్రయాణికులు నిరసన తెలిపారు.

ఈ పరిణామాలపై ఇండిగో సంస్థ స్పందిస్తూ.. సాంకేతిక లోపాలు, శీతాకాలం కారణంగా షెడ్యూళ్లలో మార్పులు, వాతావరణ సమస్యలు, విమాన రాకపోకల్లో రద్దీ, సిబ్బంది విమాన డ్యూటీ సమయాలపై కొత్త నిబంధనల అమలు వంటి అనేక కారణాల వల్ల ఈ అంతరాయం ఏర్పడిందని వివరణ ఇచ్చింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరే ముందు తమ విమాన స్థితిని తెలుసుకోవాలని ఆర్‌జీఐఏ అధికారులు సూచించారు.
IndiGo
Rajiv Gandhi International Airport
Hyderabad Airport
Flight Cancellations
Air Travel Disruption
Kolisu Parthasarathy
Ram Mohan Naidu
Airline Services
Airport Chaos
Shamsabad Airport

More Telugu News