Chandrababu Naidu: ఏపీ ఫైబర్ నెట్ కేసులో కీలక మలుపు.. చంద్రబాబుకు ఊరట.. కానీ..!

  • కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని కోర్టుకు తెలిపిన సీఐడీ, సిట్
  • కేసు మూసివేతను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన మాజీ చైర్మన్
  • పిటిషన్‌ను సోమవారం విచారించనున్న కోర్టు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుపై నమోదైన ఫైబర్ నెట్ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే కేసును మూసివేస్తున్నట్లు సిఐడి, సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు నివేదిక సమర్పించారు. అయితే, సిఐడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది.

2023లో ఫైబర్ నెట్ టెండర్ల కేటాయింపులో సుమారు రూ.300 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సిఐడి కేసు నమోదు చేసింది. బ్లాక్ లిస్టులో ఉన్న 'టెర్రా సాఫ్ట్' అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో చంద్రబాబును కూడా నిందితుడిగా చేర్చింది. అప్పట్లో ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్న గౌతమ్ రెడ్డి రాసిన లేఖ ఆధారంగానే సిఐడి ఈ కేసు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొందరిని అరెస్ట్ చేయడంతో పాటు, ఆస్తుల అటాచ్‌మెంట్‌కు కూడా సిద్ధమైంది.

అయితే, తాజాగా ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని సిఐడి, సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. మాజీ ఎండీలు కూడా తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడంతో కేసు మూసివేతకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే ఫిర్యాదుదారుడైన గౌతమ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుతో ప్రారంభమైన కేసును, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తన వాదనలు వినకుండా ఎలా మూసివేస్తారని ప్రశ్నిస్తూ ఆయన ఏసీబీ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. కోర్టు తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
Chandrababu Naidu
AP FiberNet case
Gautam Reddy
CID investigation
ACB Court
Tenders allocation
Protest petition
Andhra Pradesh
Terra Soft

More Telugu News