Srisailam Dam: శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. డ్యాం దిగువన భారీ గొయ్యి!

Srisailam Dam faces major threat huge pit found underneath
  • శ్రీశైలం డ్యాం భద్రతకు పొంచి ఉన్న పెను ముప్పు 
  • డ్యాం దిగువన 45 మీటర్ల లోతైన భారీ గొయ్యి గుర్తింపు
  • గాల్లో వేలాడుతున్న డ్యాం అప్రాన్
  • తక్షణమే మరమ్మతులు చేపట్టాలని నిపుణుల కమిటీ సిఫార్సు
కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం డ్యాం భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగువన ప్లంజ్‌పూల్‌లో భారీ గొయ్యి ఏర్పడటంతో ఆనకట్ట భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని హెచ్చరించింది. ఈ ఏడాది జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ, తాజాగా నిర్వహించిన అండర్‌ వాటర్‌ పరిశీలన అనంతరం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

డ్యాం నుంచి విడుదలయ్యే నీటి ప్రవాహ వేగానికి ప్లంజ్‌పూల్‌లో 35 నుంచి 45 మీటర్ల లోతైన గొయ్యి ఏర్పడినట్లు కమిటీ గుర్తించింది. డ్యాం అప్రాన్‌ (కాంక్రీట్ పునాది) ముగిసిన 15 మీటర్ల తర్వాత మొదలైన ఈ గొయ్యి, సుమారు 150 మీటర్ల వరకు విస్తరించింది. దీనివల్ల డ్యాం అప్రాన్‌కు తీవ్ర ముప్పు వాటిల్లింది. అప్రాన్‌ కింద 4 మీటర్ల లోతైన రంధ్రం ఏర్పడి, అది డ్యాం వైపు 14-15 మీటర్ల వరకు విస్తరించింది. దీంతో అప్రాన్‌లోని సగభాగం ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో వేలాడుతున్నట్లు నిపుణులు తేల్చిచెప్పారు.

డ్యాం పునాదుల కంటే ఎక్కువ లోతులో ఈ గొయ్యి ఉండటం అత్యంత ఆందోళన కలిగించే విషయం. 2018లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ అధ్యయనంలో గొయ్యి లోతు 32 మీటర్లు ఉండగా, ఇప్పుడు అది 45 మీటర్లకు చేరడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అప్రాన్‌ రక్షణ కోసం ఏర్పాటు చేసిన 62 స్టీల్‌ సిలిండర్లలో చాలావరకు దెబ్బతిన్నాయని, ఐదు సిలిండర్లు ఇప్పటికే వరదల్లో కొట్టుకుపోయాయని నివేదికలో పేర్కొన్నారు.

విశాఖకు చెందిన సీలైన్‌ ఆఫ్‌షోర్‌ డైవింగ్‌ సంస్థ సహకారంతో జరిగిన ఈ అధ్యయనం తర్వాత, డ్యాంకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని నిపుణుల కమిటీ గట్టిగా సిఫార్సు చేసింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.
Srisailam Dam
Krishna River
Dam safety
Plunge pool erosion
Andhra Pradesh
Dam repairs
Sealine Offshore Diving
National Institute of Oceanography
Dam apron

More Telugu News