Rupee fall: రూపాయి పతనం... యూఏఈ నుంచి వెల్లువెత్తున్న నగదు!

Rupee Fall Inflow of funds from UAE increases
  • యూఏఈ నుంచి భారత్‌కు మూడింతలు పెరిగిన రెమిటెన్స్‌లు
  • దిర్హమ్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడమే కారణం
  • ఇదే అదనుగా స్వదేశానికి భారీగా డబ్బు పంపుతున్న ప్రవాసులు
గల్ఫ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్‌కు నగదు ప్రవాహం భారీగా పెరిగింది. భారత రూపాయి విలువ పతనం కావడంతో, అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు (రెమిటెన్స్‌లు) ఏకంగా మూడింతలు పెరిగినట్లు ‘ఖలీజ్‌ టైమ్స్’ తన కథనంలో వెల్లడించింది. ప్రస్తుతం ఒక యూఏఈ దిర్హమ్‌కు 24.5 భారత రూపాయల మారకం విలువ లభిస్తుండటంతో, ఇదే సరైన సమయమని భావించి ఎన్నారైలు పెద్ద మొత్తంలో డబ్బు పంపుతున్నారు.

యూఏఈ కరెన్సీ అయిన దిర్హమ్‌ను రూపాయితో మార్చుకున్నప్పుడు గతంలో కంటే ఎక్కువ మొత్తం చేతికి వస్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని అక్కడి భారతీయులు చెబుతున్నారు. షార్జాలో నివసించే ఆరిఫ్ ఖాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, తాను సాధారణంగా ప్రతినెలా 1,200 నుంచి 1,500 దిర్హమ్‌లు పంపేవాడినని, కానీ రూపాయి పతనం కారణంగా ఈసారి 4,500 దిర్హమ్‌లు పంపినట్లు తెలిపారు. దుబాయ్‌లో ఉండే ఆంథోనీ వర్ఘీస్ అనే మరో ప్రవాసుడు మాట్లాడుతూ, ఇది తమకు ముందుగానే వచ్చిన క్రిస్మస్ బహుమతి అని అభివర్ణించారు. "సాధారణంగా 2,000 దిర్హమ్‌లు పంపే నేను, ఈసారి 3,000 పంపాను. ఈ అదనపు డబ్బు ఇండియాలోని మా కుటుంబానికి స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులకు ఉపయోగపడుతుంది" అని ఆయన వివరించారు.

ఇదిలాఉండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి వంటి కారణాలతో రూపాయి బలహీనపడుతోంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక దశలో రూపాయి విలువ 28 పైసలు క్షీణించి 90.43 వద్ద సరికొత్త జీవనకాల కనిష్ఠానికి చేరింది. ఈ పతనం మరికొంత కాలం కొనసాగవచ్చని, రూపాయి విలువ 91 మార్కును కూడా తాకే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Rupee fall
UAE
Indian Rupee
Dirham
Remittances
NRI
Currency Exchange Rate
Dollar
Sharjah
Dubai

More Telugu News