Revanth Reddy: కేసీఆర్ కుటుంబంలో గొడవలు, సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలనే దానిపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Reddy Comments on KCR Family Disputes and Sarpanch Elections
  • అక్రమ సొమ్ము కోసం ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయన్న రేవంత్ రెడ్డి
  • వారింట్లో పైసల పంచాయతీ తప్ప మరొకటి లేదన్న ముఖ్యమంత్రి
  • గ్రామాలకు నిధులు తెచ్చే వారిని సర్పంచ్‌లుగా ఎన్నుకోవాలని సూచన
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఓ కుటుంబం ప్రజల సొమ్మును దోచుకుందని, ఇప్పుడు ఆ కుటుంబంలో అక్రమ సొమ్ము కోసం గొడవలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలేశ్వరంగా మారిందని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, ఆయన ఎక్కడ పడుకున్నారో ఎవరికీ తెలియదని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి అన్నారు. ప్రజలను దోచుకున్న వారు బాగుపడినట్లు చరిత్రలో లేదని మండిపడ్డారు. ఈ రోజు నడుస్తున్న చరిత్ర కూడా అదేనని అన్నారు. ఇప్పుడు వారింట్లో జరుగుతోంది పైసల పంచాయితీ తప్ప మరొకటి కాదని అన్నారు.

అలాంటి వారిని ఎన్నుకోండి

ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయని, మంత్రులతో మాట్లాడి గ్రామాలకు నిధులు తెచ్చే వారిని గెలిపించుకోండని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గొడవలు సృష్టించే వారిని పక్కన పెట్టాలని అన్నారు. ఎన్నికల్లో కూడా అడ్డగోలుగా ఖర్చు పెట్టవద్దని, మీరు అలా ఖర్చు పెడితే అంత ఆదాయం కూడా రాదని అన్నారు.

నిధులు ఇస్తామని, గ్రామాలను అభివృద్ధి చేసుకోండని సూచించారు. కేంద్రం వద్దకు తాము వెళ్లి నిధులు తెచ్చుకున్నట్లు, సర్పంచ్‌లు కూడా మంత్రుల వద్దకు వెళ్లి నిధులు తెచ్చుకోగలగాలని అన్నారు. మంచివారిని ఎన్నుకోండి.. నిధులిచ్చే బాధ్యత మాదే అన్నారు. విద్యార్థులు కూడా ఎన్నికలు అంటూ తిరగవద్దని, బాగా చదువుకుని, ఐపీఎస్, ఐఏఎస్, డాక్టర్లు కావాలని అన్నారు. అప్పుడే ఈ రేవంతన్న సంతోషంగా ఉంటాడని అన్నారు.
Revanth Reddy
KCR family
Telangana
Sarpanch elections
BRS
Kaleshwaram project

More Telugu News