YS Sharmila: చంద్రబాబు చెబుతున్న మాట ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్: షర్మిల

YS Sharmila Slams Chandrababu on Electricity Charges
  • విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్న సీఎం చంద్రబాబు
  • చంద్రబాబు మాటలు తీవ్ర హాస్యాస్పదం అన్న షర్మిల
  • 17 నెలల్లో ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపారని ఆరోపణ
  • సర్దుబాటు ఛార్జీల భారాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలపై చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా విమర్శించారు. ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు చెప్పడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని ఆమె ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం మోపిందని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.

"విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు తీవ్ర హాస్యాస్పదం. బిల్లుల మోతతో ఒకపక్క వాతలు పెడుతున్నారు. సర్దుపోటుతో గుండెపోటు తెప్పిస్తున్నారు. షాకుల మీద షాకులు ఇస్తూ ఇల్లు గుల్ల చేస్తున్నారు. మరోపక్క ఛార్జీలు పెంచమని తేనె పూసిన కత్తి మాటలు చెప్తున్నారు. 

17 నెలల కూటమి పాలనలో ప్రజలపై మోపిన అధిక చార్జీల భారం రూ.15,485 కోట్లు. వచ్చే రెండేళ్ల పాటు ట్రూ అప్ ప్రజల నెత్తిన పెను భారమే. యూనిట్ కు అదనంగా 40 పైసలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తూ కూడా... ఛార్జీలు పెంచను, మాటమీద కట్టుబడి ఉన్నాం అంటూ చంద్రబాబు చెబుతున్న మాట ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్. 

ఇచ్చిన మాట మీద నిలబడే తత్వమే చంద్రబాబుకు ఉంటే, ఛార్జీల భారం ప్రజలపై పడొద్దనే చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సర్దుబాటు భారం రూ.15,485 కోట్లు రద్దు చేయండి. ట్రూ అప్ పేరుతో ఇప్పటి వరకు వసూలు చేసిన 3 వేల కోట్లను ప్రజలకు ట్రూ డౌన్ రూపంలో తిరిగి చెల్లించండి. అమలవుతున్న ఛార్జీలలో 30 శాతం తగ్గింపు వెంటనే అమలు చేయండి" అంటూ షర్మిల డిమాండ్ చేశారు. 

YS Sharmila
Chandrababu Naidu
APCC
Andhra Pradesh
Electricity charges
Power tariffs
AP government
True up charges
Political criticism
Andhra Pradesh politics

More Telugu News