Rahul Gandhi: కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.. పుతిన్ పర్యటనకు ముందు కలకలం

Rahul Gandhi Alleges Government Blocking Meetings with Foreign Delegates
  • విదేశీ ప్రతినిధులతో ప్రతిపక్ష నేత భేటీని కేంద్రం అడ్డుకుంటోందంటూ ఆరోప‌ణ‌
  • ప్రభుత్వం అభద్రతాభావంతో ఇలా వ్యవహరిస్తోందన్న రాహుల్ గాంధీ
  • గత ప్రభుత్వాల హయాంలో ఈ సంప్రదాయం ఉండేదని వెల్లడి
  • రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. విదేశీ ప్రతినిధులు భారత్‌కు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతతో సమావేశం కాకుండా కేంద్రం అడ్డుకుంటోందని ఆయన విమర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశ పర్యటనకు కొన్ని గంటల ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్, గతంలో విదేశీ ప్రతినిధులు దేశానికి వస్తే ప్రతిపక్ష నాయకుడితో సమావేశమవడం ఒక సంప్రదాయంగా ఉండేదని గుర్తుచేశారు. వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ఈ పద్ధతి కొనసాగిందని తెలిపారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టిందని ఆరోపించారు.

"విదేశీ ప్రతినిధులతో మమ్మల్ని కలవకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది. ప్రతిపక్ష నేతతో మాట్లాడొద్దని వారికి సూచిస్తోంది. ప్రభుత్వం తన అభద్రతాభావం కారణంగానే ఇలా చేస్తోంది" అని రాహుల్ పేర్కొన్నారు. ఈ దేశానికి కేవలం ప్రభుత్వమే కాదని, ప్రతిపక్షం కూడా ప్రజల గొంతుక అని ఆయన అన్నారు. జాతీయ అంశాలపై ప్రతిపక్షాల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలని సూచించారు. ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ దీనికి అనుమతించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ‌ సాయంత్రం భారత్‌కు రానున్నారు. ఆయనకు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. శుక్రవారం ఇరు దేశాల మధ్య అధికారిక సమావేశం జరగనుంది. ఈ కీలక పర్యటనకు ముందు రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Rahul Gandhi
Rahul Gandhi allegations
Vladimir Putin India visit
Congress party
Indian government
Foreign delegates
Opposition leader
India Russia relations
Narendra Modi
Political news

More Telugu News