Ukraine Russia war: వోవ్‌చాన్స్క్‌లోని రష్యా డ్రోన్ కంట్రోల్ సెంటర్ పై 226 కిలోల బాంబుతో ఉక్రెయిన్ దాడి

Ukraine Strikes Russian Drone Control in Vovchansk With 226kg Bomb
  • గ్రెయిన్ ఎలివేటర్‌ను లక్ష్యంగా చేసుకుని సుఖోయ్ జెట్ నుంచి బాంబు ప్రయోగం
  • దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
  • రష్యా కమ్యూనికేషన్ హబ్ ధ్వంసం
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని వోవ్‌చాన్స్క్‌లో రష్యాకు చెందిన కీలకమైన డ్రోన్ కంట్రోల్ మరియు కమ్యూనికేషన్ కేంద్రాన్ని ఉక్రెయిన్ వైమానిక దళం విజయవంతంగా ధ్వంసం చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో ప్రకారం, ఒక గ్రెయిన్ ఎలివేటర్ (ధాన్యాగారం) పై అంతస్తులలో మాటువేసిన రష్యన్ డ్రోన్ బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్‌కు చెందిన సుఖోయ్-27 ఫైటర్ జెట్ ఆకాశం నుంచి బాంబును జారవిడిచింది. అది నేరుగా లక్ష్యాన్ని ఛేదించడంతో భారీ పేలుడు సంభవించి, దట్టమైన పొగ, శిథిలాలు గాల్లోకి ఎగిరిపడ్డాయి.

ఈ దాడిలో సుమారు 226 కిలోల (500 పౌండ్లు) బరువున్న జీబీయూ-62 జేడీఏఎం-ఈఆర్ (JDAM-ER) ప్రెసిషన్ గ్లైడ్ బాంబును ఉపయోగించినట్లు నిపుణులు గుర్తించారు. ఈ బాంబు జీపీఎస్ సాయంతో తనంతట తానే లక్ష్యాన్ని గుర్తించి ఛేదించగలదు. గ్లైడ్ కిట్ ఉండటం వల్ల, ఫైటర్ జెట్ లక్ష్యానికి చాలా దూరం నుంచే దీనిని ప్రయోగించే వీలుంటుంది. ఉక్రెయిన్ వద్ద ఉన్న పాత సోవియట్ కాలం నాటి మిగ్-29 జెట్‌లలో కూడా పనిచేసేలా ఈ బాంబులను మార్పులు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇదిలా ఉండగా, రష్యా దళాలు చుట్టుముట్టిన మిర్నోగ్రాడ్ పట్టణం తీవ్రంగా ధ్వంసమైనట్లు అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసిన డ్రోన్ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. "ఆ పట్టణాన్ని భూమిపై నుంచి పూర్తిగా తుడిచిపెట్టేందుకు రష్యా ప్రయత్నిస్తోంది" అని ఉక్రెయిన్ సైనికాధికారి ఒలెక్సీ హోడ్జెంకో ఆరోపించారు. అక్కడి సైనికులకు ఆహారం, నీరు అందించేందుకు ఉక్రెయిన్ గ్రౌండ్-రోబోట్ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది.
Ukraine Russia war
Russia Ukraine war
Vovchansk
JDAM-ER
Olexiy Khodzjenko
Mirnograd
Ukraine military
Russian drone control

More Telugu News