Cyber Fraud: స్కామర్ ను బోల్తా కొట్టించి ప్రాధేయపడేలా చేసిన ఢిల్లీ యువకుడు.. ఏంజరిగిందంటే..!

Delhi Youth Turns Tables on Scammer Using Chat GPT
  • ఆర్మీ ఆఫీసర్ లా నటిస్తూ తక్కువ ధరకే ఫర్నీచర్ అమ్మేస్తున్నట్లు మెసేజ్
  • ప్రొఫైల్ ఫొటో తన కాలేజ్ సీనియర్ దని గుర్తించిన యువకుడు
  • ఛాట్ జీపీటీ సాయంతో లింక్ పంపి మోసగాడి చిరునామా, ఫొటో రాబట్టిన వైనం
ఆర్మీ అధికారిగా నమ్మించి మోసం చేయాలని చూసిన సైబర్ దుండగుడికి ఢిల్లీకి చెందిన ఓ యువకుడు చుక్కలు చూపించాడు. చాట్ జీపీటీ సాయంతో వెబ్ సైట్ లింక్ పంపించి మోసగాడి ఐపీ అడ్రస్, మొబైల్ కెమెరా హ్యాక్ చేసి ఫొటో సంపాదించాడు. ఆ వివరాలు అతడికే పంపడంతో సైబర్ మోసగాడు కాళ్లబేరానికి వచ్చాడు. ఇకపై ఈ మోసాలకు స్వస్తి చెబుతానని, తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు.

అసలేం జరిగిందంటే..
ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి ఫేస్ బుక్ లో గుర్తుతెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. తన ఫ్రెండ్ సీఆర్పీఎఫ్ ఆఫీసర్ అని, అకస్మాత్తుగా బదిలీ కావడంతో ఇంట్లోని ఫర్నీచర్ మొత్తాన్ని అయినకాడికి అమ్మేస్తున్నాడని ఆగంతకుడు చెప్పాడు. ఫర్నీచర్ ఫొటోలు పెట్టి అతి తక్కువ ధరకే ఇప్పిస్తానని తెలిపాడు. అయితే, ఆ ప్రొఫైల్ ఫొటో తన కాలేజీ సీనియర్, ఐఏఎస్ ఆఫీసర్ దని ఢిల్లీ వాసి గుర్తించాడు. వెంటనే తన సీనియర్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడంతో తనకు వచ్చిన మెసేజ్ మోసమని తేలింది.

ఇక ఈ మోసగాడిని ఓ ఆట ఆడుకోవాలని భావించిన ఢిల్లీ యువకుడు.. ఫర్నీచర్ కొంటానని చెప్పాడు. దీంతో మోసగాడు ఓ క్యూఆర్ కోడ్ పంపి డబ్బులు చెల్లించాలని అడగగా.. ఆ కోడ్ స్కాన్ కావట్లేదని చెప్పి ఛాట్ జీపీటీ సాయంతో తయారుచేసిన ఫేక్ వెబ్ సైట్ లింక్ ను మోసగాడికి పంపించాడు. ఆ లింక్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ పోస్ట్ చేయాలని అడిగాడు. డబ్బులు వస్తున్నాయనే ఆనందంలో వెనకాముందు చూడకుండా మోసగాడు ఆ లింక్ క్లిక్ చేశాడు.

ఆ వెంటనే మోసగాడి ఐపీ అడ్రస్, రాజస్థాన్ లోని అతడు ఉంటున్న ఇంటి చిరునామాతో పాటు మొబైల్ ఫ్రంట్ కెమెరా సాయంతో తీసిన స్పాట్ ఫొటో ఢిల్లీ వాసి రాబట్టాడు. ఆపై ఆ వివరాలను ఆ మోసగాడికే పంపించాడు. ఊహించని ఈ పరిణామంతో మోసగాడు కంగుతిన్నాడు. తనను వదిలేయాలని ప్రాధేయపడ్డాడు. అయితే, ఈ మోసగాడి వివరాలను, మోసం చేయాలనుకున్న పద్ధతికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాజస్థాన్ సైబర్ పోలీసులకు పంపించానని ఢిల్లీ వాసి చెప్పాడు. ఈ వివరాలన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Cyber Fraud
Delhi Youth
Chat GPT
Cyber Crime Rajasthan
Online Scam
IP Address Tracking
Mobile Camera Hack
QR Code Scam

More Telugu News