Naga Chaitanya: బడా డైరెక్టర్లతో సినిమాలు చేయకపోవడంపై క్లారిటీ ఇచ్చిన నాగ చైతన్య!

Naga Chaitanya reveals reason for not working with star directors
  • నాన్న తలుచుకుంటే ఏ దర్శకుడైనా వస్తారన్న చైతూ
  • స్వతంత్రంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని వెల్లడి
  • ప్రస్తుతం కార్తీక్ దండుతో పాన్ ఇండియా సినిమా
అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్.. పెద్ద దర్శకులతో ఎందుకు సినిమాలు చేయడం లేదనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు, ఊహాగానాలకు నాగ చైతన్య స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. తండ్రి నాగార్జున అండ ఉన్నప్పటికీ, స్వతంత్రంగా ఎదగాలనే ఉద్దేశంతోనే తాము ఆచితూచి అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ విషయంపై చైతన్య మాట్లాడుతూ.. "నాన్న (నాగార్జున) తలుచుకుంటే ఏ డైరెక్టర్‌తోనైనా నేను సినిమా చేసేలా క్షణాల్లో సెట్ చేయగలరు. చాలాసార్లు నన్ను అడిగారు కూడా. ఎవరితోనైనా మాట్లాడాలా? అని ఆరా తీసేవారు. ఆయన స్టూడియో నుంచి ఒక్క ఫోన్ కాల్ వెళ్తే చాలు. కానీ, ఆయన సహకారంతో నటుడిగా వచ్చాక కూడా ప్రతీదానికి ఆయనపైనే ఆధారపడితే మేం సాధించేది ఏముంటుంది? అందుకే సొంతంగా ఎదగాలనుకుంటున్నాం" అని అన్నారు.

ఈ విషయంలో నాగార్జునను తప్పుగా అనుకోవద్దని, తమ ఎదుగుదలను కోరుకునే తండ్రిగా ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని చైతన్య పేర్కొన్నారు. ఆయన మాటలతో అక్కినేని సోదరులు స్టార్ డైరెక్టర్లతో పనిచేయకపోవడానికి కారణం అవకాశాలు లేకపోవడం కాదని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని స్పష్టమైంది.

ప్రస్తుతం నాగ చైతన్య.. 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే మైథలాజికల్‌ థ్రిల్లర్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల ఆయన నటించిన 'తండేల్' మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు అఖిల్ కూడా తన కెరీర్‌ను విభిన్నమైన కథలతో ముందుకు తీసుకెళ్తున్నారు.
Naga Chaitanya
Akkineni
Nagarjuna
Akhil Akkineni
Tollywood
Vrisha Karma
Karthik Dandu
Thandel
Telugu cinema
Big directors

More Telugu News