Abhay Singh: పుతిన్ ను 'ఎస్-500' వ్యవస్థ కోసం అడగాలి.. ఇండియాకు సూచించిన భారత సంతతి రష్యన్ ఎం.ఎల్.ఏ

Abhay Singh urges India to request S 500 system from Russia
  • నేడు భారత్‌కు రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
  • చైనాకు కూడా అందని అత్యాధునిక టెక్నాలజీ ఎస్-500
  • రక్షణ, వాణిజ్యంతో పాటు భారతీయుల ఉపాధిపై చర్చల అంచనా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్న వేళ, ఆయన పార్టీకి చెందిన భారత సంతతి చట్టసభ సభ్యుడు (MLA) అభయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ అత్యాధునిక ఎస్-500 వాయు రక్షణ వ్యవస్థ కోసం రష్యాపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. నేటి నుంచి ఢిల్లీలో 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

పాట్నాలో జన్మించిన అభయ్ సింగ్ ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దులోని కుర్స్క్ ప్రాంతానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఆయన ‘ఇండియా టుడే టీవీ’తో మాట్లాడుతూ "భారత్ వద్ద ఉన్న ఎస్-400 చాలా మంచి క్షిపణి వ్యవస్థ. కానీ ఎస్-500 అనేది అత్యాధునిక టెక్నాలజీ. ప్రస్తుతం రష్యా మాత్రమే దీన్ని ఉపయోగిస్తోంది. ఒకవేళ సరఫరా చేయడానికి రష్యా అంగీకరిస్తే, ఈ వ్యవస్థను పొందిన తొలి దేశం ఇండియానే అవుతుంది. చైనాకు కూడా ఈ టెక్నాలజీ లేదు. ఇది భారత్‌కు గొప్ప విజయం అవుతుంది" అని వివరించారు.

కాగా, నాలుగేళ్ల విరామం తర్వాత పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, రష్యా నుంచి భారత్ రాయితీపై ముడిచమురు కొనుగోళ్లు వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సదస్సులో రక్షణ సహకారం, వాణిజ్యం, అణు ప్రాజెక్టులు, సాంకేతిక మార్పిడి, వ్యవసాయం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

ఈ పర్యటనలో సుఖోయ్-57 యుద్ధ విమానాలు, భారతీయులకు రష్యాలో వర్క్ పర్మిట్లు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని అభయ్ సింగ్ తెలిపారు. పశ్చిమ దేశాలు భారతీయులకు నిబంధనలు కఠినతరం చేస్తున్నాయని, కానీ రష్యాలో నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత ఉందని, భారతీయులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పుతిన్ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Abhay Singh
Russia India summit
S-500 missile system
Vladimir Putin India visit
India Russia relations
Defense cooperation
S-400 missile
Russian technology
India Russia trade

More Telugu News