Dola Bala Veeranjaneya Swamy: ఏపీ గురుకుల విద్యార్థుల కుటుంబాలకు 'సాంత్వన' భరోసా.. రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా

Dola Bala Veeranjaneya Swamy Announces Santwana Scheme for Gurukula Students
  • ఈ పథకం కోసం రూ.5 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్న మంత్రి  
  • అనారోగ్యంతో మరణిస్తే రూ. 3 లక్షల ఎక్స్‌గ్రేషియా
  • దేశంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదన్న మంత్రి డోలా స్వామి
  • మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లోని డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతూ అనారోగ్యంతో దురదృష్టవశాత్తు మరణించిన విద్యార్థుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'సాంత్వన' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద మృతుల కుటుంబానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ పేద విద్యార్థుల కోసం ఇలాంటి పథకం లేదని ఆయన స్పష్టం చేశారు.
 
తాడేపల్లిలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో, ఇటీవల అనారోగ్యంతో మరణించిన ముగ్గురు విద్యార్థినుల కుటుంబాలకు మంత్రి డోలా స్వామి సాంత్వన చెక్కులను అందజేశారు. పల్నాడు జిల్లా ఆర్కేపురం గురుకులం విద్యార్థిని టి.నిహారిక, ప్రకాశం జిల్లా రాచర్ల గురుకులం విద్యార్థిని కొఠారి కర్ణ, బాపట్ల గురుకులం విద్యార్థిని బి. శ్వేత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున మొత్తం రూ. 9 లక్షల ఆర్థిక సాయం పంపిణీ చేశారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో రూ.5కోట్ల నిధులు కేటాయించి ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. "పేద విద్యార్థుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం. గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అనారోగ్యానికి గురైన వారిని గుర్తించి వెంటనే వైద్యం అందించి ఇప్పటివరకు 30 మందికి పైగా విద్యార్థుల ప్రాణాలు కాపాడాం" అని వివరించారు.
 
ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. లావణ్య వేణి, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ అదనపు కార్యదర్శి సునీల్ రాజ్ కుమార్, డా. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Dola Bala Veeranjaneya Swamy
Santwana Scheme
Andhra Pradesh government
Gurukula students
Social Welfare Department
Financial assistance
Student death
Chandrababu Naidu
AP social welfare

More Telugu News