Higher Education: ఉన్నత విద్యలో జనరల్‌ను దాటేసిన రిజర్వ్డ్ విద్యార్థులు!

Reserved Category Students Surpass General in Higher Education
  • 2023 నాటికి 60.8 శాతానికి చేరిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నమోదు
  • జనరల్ విద్యార్థుల వాటా 39 శాతానికి పడిపోయిందన్న నివేదిక
  • ఐఐఎం ఉదయ్‌పూర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
దేశంలో ఉన్నత విద్యా రంగంలో ఒక కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల సంఖ్య మొదటిసారిగా జనరల్ కేటగిరీ విద్యార్థులను అధిగమించింది. ఐఐఎం ఉదయ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది.

2022-23 విద్యా సంవత్సరానికి దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కోటా విద్యార్థుల వాటా 60.8 శాతానికి చేరింది. దశాబ్దం క్రితం, అంటే 2010-11లో ఇది కేవలం 43.1 శాతంగా ఉండేది. ఇదే సమయంలో జనరల్ కేటగిరీ విద్యార్థుల సంఖ్య (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో కలిపి) 2011లో 57 శాతం ఉండగా, 2023 నాటికి అది 39 శాతానికి పడిపోయింది. ఒక్క 2023లోనే జనరల్ విద్యార్థుల కంటే రిజర్వ్డ్ విద్యార్థుల నమోదు ఏకంగా 95 లక్షలు అధికంగా ఉండటం గమనార్హం.

కేంద్ర విద్యా శాఖ 15 ఏళ్ల విరామం తర్వాత విడుదల చేసిన 'ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే (AISHE)' నివేదికలను విశ్లేషించి ఐఐఎం పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. దీనిపై పరిశోధక బృందంలోని ప్రొఫెసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. "భారతీయ ఉన్నత విద్యలో సామాజిక సమతుల్యతపై విస్తృతంగా ప్రచారంలో ఉన్న అపోహలకు ఈ నివేదిక ముగింపు పలుకుతుంది. అందరూ భావిస్తున్న దానికి భిన్నంగా, ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది" అని వివరించారు. అన్ని రకాల విద్యాసంస్థల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని ఆయన తెలిపారు.
Higher Education
Reserved Category Students
SC ST OBC
General Category
IIM Udaipur
AISHE Report
Education Survey
Student Enrollment
Krishna Murthy
Indian Education System

More Telugu News