BJP: గత ఎన్నికల్లో బీజేపీకి టాటా ట్రస్ట్ భారీ విరాళం.. వైసీపీ, బీఆర్ఎస్‌లకు కూడా!

BJP Receives Huge Donation from Tata Trust Also YSRCP BRS
  • టాటా గ్రూప్ ట్రస్ట్ నుంచి బీజేపీకి రూ.757 కోట్ల భారీ విరాళం
  • మొత్తం రూ.914 కోట్ల విరాళాల్లో 83 శాతం నిధులు కమలానికే
  • వైసీపీ, బీఆర్ఎస్ సహా 8 పార్టీలకు తలా రూ.10 కోట్లు
  • ఇతర ట్రస్టుల ద్వారా కాంగ్రెస్‌కు రూ.313 కోట్లకు పైగా నిధులు
గత సార్వత్రిక ఎన్నికల సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి విరాళాలు వెల్లువెత్తాయి. ప్రముఖ టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి ఏకంగా రూ.757 కోట్లు అందాయి. ఈ ట్రస్ట్ మొత్తం 10 రాజకీయ పార్టీలకు రూ.914 కోట్లు పంచగా, అందులో దాదాపు 83 శాతం నిధులు ఒక్క బీజేపీ ఖాతాలోకే వెళ్లడం గమనార్హం.

ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదికల ప్రకారం ఇదే ట్రస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రూ.77.3 కోట్లు (8.4 శాతం) మాత్రమే అందాయి. బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), శివసేన, బీఆర్ఎస్, బీజేడీ, జేడీయూ, ఎల్జేపీ, డీఎంకే పార్టీలకు పీఈటీ తలా రూ.10 కోట్ల చొప్పున విరాళాలు అందించింది. ఈ నిధులన్నీ 15 టాటా గ్రూప్ కంపెనీల నుంచే వచ్చినట్లు ట్రస్ట్ వెల్లడించింది. టాటా సన్స్ (రూ.308 కోట్లు), టీసీఎస్ (రూ.217 కోట్లు), టాటా స్టీల్ (రూ.173 కోట్లు) ప్రధాన దాతలుగా ఉన్నాయి.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి 2024-25లో వివిధ ట్రస్టులు, సంస్థల ద్వారా మొత్తం రూ.517.37 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి అత్యధికంగా రూ.216.33 కోట్లు అందాయి.

సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడంలో ఎలక్టోరల్ ట్రస్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇదిలా ఉండగా, బీజేపీకి సంబంధించిన 2024-25 విరాళాల నివేదిక ఇంకా ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాలేదు. దీనిపై ఈసీ అధికారులు పరిశీలిస్తామని తెలిపారు.
BJP
Bharatiya Janata Party
Tata Trust
Progressive Electoral Trust
YSR Congress Party
BRS
Congress Party
Election Commission of India
Political Donations

More Telugu News