Mahavatar Narasimha: 'మహావతార్ నరసింహ'.. పాకిస్థాన్‌లోనూ ప్రశంసలు!

Mahavatar Narasimha Movie Praised in Pakistan
  • ఆస్కార్ బరిలో నిలిచిన భారత యానిమేషన్ చిత్రం 'మహావతార్ నరసింహ'
  • బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమా
  • పాకిస్థాన్‌లోని కరాచీ ఆలయంలో హిందువుల కోసం ప్రత్యేక ప్రదర్శన
భారీ తారాగణం, పెద్ద ప్రచార ఆర్భాటం లేకుండానే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన భారత యానిమేషన్ చిత్రం ‘మహావతార్ నరసింహ’ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ఈ సినిమా... 98వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది.

హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి రోజు నుంచే మౌత్ టాక్‌తో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో నరసింహ పురాణం, విష్ణు పురాణంలోని ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలోనే కాకుండా, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది.

ప్రస్తుతం 98వ ఆస్కార్ అవార్డుల కోసం ‘ఉత్తమ యానిమేషన్ ఫిల్మ్’ కేటగిరీలో పోటీ పడుతున్న 35 చిత్రాల ప్రాథమిక జాబితాలో ‘మహావతార్ నరసింహ’ చోటు దక్కించుకుంది. జనవరి 22న ప్రకటించే తుది నామినేషన్లలో ఈ చిత్రం ఎంపికైతే, ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ యానిమేషన్ చిత్రంగా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు, ‘హోంబౌండ్’ చిత్రం ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, ఇటీవల ఈ చిత్రాన్ని పాకిస్థాన్‌లోని కరాచీ స్వామి నారాయణ దేవాలయంలో ప్రదర్శించడం విశేషం. ఈ ప్రదర్శనకు వందలాదిగా తరలివచ్చిన పాకిస్థానీ హిందువులు, వెండితెరపై నరసింహస్వామి కథను చూసి భావోద్వేగానికి గురయ్యారు. పురాణాల ప్రకారం, హిరణ్యకశ్యపుడి స్వస్థలం నేటి పాకిస్థాన్‌లోని ముల్తాన్ అని, నరసింహావతారం అక్కడే జరిగిందని స్థానిక పండితులు చెబుతుండటం ఈ సందర్భంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 
Mahavatar Narasimha
Narasimha
Oscar Awards
Indian Animation Film
Ashwin Kumar
Hombale Films
Pakistan
Karachi
Vishnu Purana
Hiranyakashipu

More Telugu News