YS Sharmila: ఉప ముఖ్యమంత్రి గారూ, మీకు ఇది సబబు కాదు: పవన్ కల్యాణ్ 'తెలంగాణ' వ్యాఖ్యలపై షర్మిల

YS Sharmila Slams Pawan Kalyan Remarks on Telangana
  • అన్నదమ్ముల్లా ఉంటున్న రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సరికాదన్న షర్మిల
  • తెలంగాణ వారి దిష్టి తగిలిందనడం బాధాకరమని వ్యాఖ్య
  • కొబ్బరి పంటకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టక దిష్టి మీదకు తోసేయడం ఏమిటని ప్రశ్న
తెలంగాణ నాయకుల దిష్టి తగలడం వల్లనే కోనసీమలో కొబ్బరితోటలు ఎండిపోయాయన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. అన్నదమ్ముల్లా ఉంటున్న రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం ఉప ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

"కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడటం బాధాకరం. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే. ఇది పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు" అని ఆమె పేర్కొన్నారు.

శంకరగుప్తం డ్రెయిన్‌కు ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ నిర్మాణాలకు పట్టింపు లేకపోతే, సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోయాయని, దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని ఆమె ఆరోపించారు. దీనిని దిష్టి మీద రుద్దడం సరికాదని అన్నారు.

"మూఢ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదు. కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించండి. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపండి. రూ.3,500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టండి" అని ఆమె పేర్కొన్నారు.
YS Sharmila
Pawan Kalyan
Telangana
Andhra Pradesh
Konaseema
Coconut trees

More Telugu News