Jaishankar: వలసలపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే ఆ దేశాలే నష్టపోతాయి: జైశంకర్ హెచ్చరిక

Jaishankar Warns Excessive Immigration Restrictions Hurt Western Nations
  • అమెరికా, ఐరోపా దేశాల్లో వలసలపై ఆంక్షలను తప్పుబట్టిన జైశంకర్
  • ఆంక్షలు విధిస్తే ఆ దేశ సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశముందని వ్యాఖ్య
  • నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ప్రవాహం ఇరుదేశాలకు ప్రయోజనమన్న జైశంకర్
పశ్చిమ దేశాలలోని వలస వ్యతిరేక విధానాలపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికా, ఐరోపా దేశాల్లో వలసలపై ఆంక్షలను తప్పుబట్టారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులపై మితిమీరిన ఆంక్షలు విధిస్తే ఆయా దేశాల సొంత ప్రయోజనాలే దెబ్బతినే అవకాశం ఉందని, వారే నష్టపోతారని హెచ్చరించారు.

చాలా సందర్భాల్లో వారే ఈ సమస్యను సృష్టించారని, కాబట్టి స్వయంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతిభా ప్రవాహానికి అడ్డంకులు ఏర్పరచడం సరికాదని అభిప్రాయపడ్డారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలకు, ఆయా దేశాల్లోని సంక్షోభానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వలసలకు సంబంధించి అమెరికా, ఐరోపా దేశాల్లో ఏమైనా ఆందోళనలు ఉంటే అవి ఆ దేశాలు అమలు చేసిన దీర్ఘకాలిక విధానాల ఫలితమే అన్నారు.

గత రెండు దశాబ్దాలలో ఉద్దేశపూర్వకంగా, అన్నీ తెలిసే తమ వ్యాపారాలను వ్యూహాత్మకంగా విదేశాలకు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. కాబట్టి ఈ సమస్యకు స్వయంగా వారే పరిష్కార మార్గాలు చూపించాలని అన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల ప్రవాహం ఇరు దేశాలకు ప్రయోజనమని వారు గుర్తించాలని ఆయన అన్నారు. ప్రపంచం ఆధునాతన తయారీ రంగం వైపు మళ్లుతున్న కొద్దీ, నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరం పెరుగుతుందని అన్నారు. ఏ దేశం కూడా స్వయంగా సరిపడా సంఖ్యలో నిపుణులను వేగంగా తయారు చేయలేదని అన్నారు.
Jaishankar
S Jaishankar
Indian Foreign Minister
Immigration policy
US immigration

More Telugu News