Akhanda 2: 'అఖండ 2'లో ఆ సర్‌ప్రైజ్ ఇదే.. అసలు విషయం చెప్పిన బోయపాటి శ్రీను

Boyapati Srinu Reveals Akhanda 2 Surprise
  • బాలయ్య-బోయపాటిల హిట్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2'
  • ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
  • భక్త ప్రహ్లాదుడి పాత్రలో బోయపాటి తనయుడు వర్షిత్
  • కీలక పాత్రపై సోషల్ మీడియా ద్వారా స్పష్టతనిచ్చిన బోయపాటి
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల వేగం పెంచిన చిత్రబృందం, తాజాగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఈ చిత్రంలో బోయపాటి శ్రీను చిన్న కుమారుడు వర్షిత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అయితే ఆ పాత్ర ఏంటనే సస్పెన్స్‌కు దర్శకుడు బోయపాటి స్వయంగా తెరదించారు.

‘అఖండ 2’లో తన కుమారుడు వర్షిత్ ‘భక్త ప్రహ్లాదుడు’గా కనిపించనున్నాడని బోయపాటి శ్రీను తన ఎక్స్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను సినిమాలో నటిస్తున్నట్లు వర్షిత్ చెప్పినప్పటికీ, పాత్ర వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే, సినిమా ట్రైలర్‌ను జాగ్రత్తగా గమనిస్తే ప్రహ్లాదుడి గెటప్‌లో ఉన్న బాలుడిని చూడవచ్చని బోయపాటి తెలిపారు. ఆధునిక కథాంశంతో సాగే ఈ సినిమాలో భక్త ప్రహ్లాదుడి పాత్రను ఎలా జోడించారు, దాని ప్రాముఖ్యత ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.

ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తుండగా, హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహన్‌ సింగ్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మిలియన్ల వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగాన్ని మించిన విజయం సాధిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Akhanda 2
Boyapati Srinu
Nandamuri Balakrishna
Varshith Boyapati
Bhakta Prahlada
Telugu cinema
Tollywood
Adi Pinisetty
Harshali Malhotra
14 Reels Plus

More Telugu News