Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఆదేశాలతో బారికేడ్ల స్థానంలో పూలకుండీలు

Chandrababu Naidu Orders Removal of Barricades at AP Secretariat
  • సచివాలయం వద్ద బారికేడ్ల ఏర్పాటుపై సీఎం ఆగ్రహం  
  • ఇది కమర్షియల్ కాంప్లెక్సా? అని ప్రశ్నించిన చంద్రబాబు
  • వెంటనే బారికేడ్లు తొలగించి ఆహ్లాదకర వాతావరణం కల్పించాలన్న సీఎం   
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ఇది రాష్ట్ర సచివాలయమా? లేక కమర్షియల్ కాంప్లెక్సా?" అని ఆయన అధికారులను ప్రశ్నించారు. సచివాలయానికి వచ్చేవారికి ఇబ్బంది కలిగించేలా బారికేడ్లు ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో అధికారులు తక్షణమే వాటిని తొలగించారు.
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సచివాలయానికి వస్తున్న సమయంలో, పోలీసులు ప్రధాన రహదారిపై వాహనాలు, ప్రజలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారికి రెండు వైపులా ప్రకటనలతో కూడిన బారికేడ్లను అడ్డుగా పెట్టడాన్ని గమనించిన సీఎం.. ఎందుకిలా చేశారని అక్కడికక్కడే అసహనం ప్రదర్శించారు.
 
అనంతరం జరిగిన ఆర్టీజీఎస్ సమావేశంలోనూ ఈ అంశంపై ఆయన అధికారులతో చర్చించారు. పోలీసులు కేవలం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తే సరిపోతుందని, రహదారిని పూర్తిగా మూసివేస్తూ బారికేడ్లు పెట్టడం సరికాదన్నారు. ఇక్కడి ఏర్పాట్ల కంటే పింఛన్ల పంపిణీ కోసం తాను వెళ్తున్న గ్రామాల్లోనే ఏర్పాట్లు బాగున్నాయని సీఎం వ్యాఖ్యానించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి సచివాలయం ఆవరణలోని బారికేడ్లను పూర్తిగా తొలగించారు. వాటి స్థానంలో అందమైన పూలకుండీలను ఏర్పాటు చేశారు.
 
Chandrababu Naidu
Andhra Pradesh
AP Secretariat
Amaravati
Barricades
Flower Pots
Traffic Management
RTGS Meeting
Public Access
Governance

More Telugu News