Tilak Varma: రోహిత్, కోహ్లీ జట్టులో ఉంటే ఆ కిక్కే వేరు.. నా ఎదుగుదలకు కారణం వారే: తిలక్ వర్మ

Tilak Varma Says Rohit Kohli Presence Boosts Confidence
  • రోహిత్, విరాట్ జట్టులో ఉంటే ఆత్మవిశ్వాసం వేరుగా ఉంటుంద‌న్న తిల‌క్‌
  • త‌న ఎదుగుద‌ల‌లో ఆ ముగ్గురి పాత్ర ఎంతో ఉందన్న‌ తెలుగు ప్లేయ‌ర్‌
  • విరాట్ నుంచి ఫిట్‌నెస్ పాఠాలు నేర్చుకుంటున్నా అని వెల్లడి
  • ప్రాక్టీస్‌లోనే ఒత్తిడిని తట్టుకునేలా గంభీర్ శిక్షణ ఇస్తాడ‌ని వ్యాఖ్య
టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు ఉంటే మిగతా ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. తన ఎదుగుదలలో ఈ ఇద్దరు సీనియర్లతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ పాత్ర ఎంతో ఉందన్నాడు.

ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ... "వన్డే, టెస్టు క్రికెట్ నా సహజమైన ఆటలా అనిపిస్తుంది. ఈ సుదీర్ఘ ఫార్మాట్లను నేను చాలా ఆస్వాదిస్తాను. రోహిత్ భాయ్, విరాట్ భాయ్ ఒకే జట్టులో ఉన్నప్పుడు మాలో ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంటుంది. వారి అనుభవం, పరిజ్ఞానం నుంచి వీలైనంత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను" అని తెలిపాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్, వికెట్ల మధ్య పరుగుల విషయంలో విరాట్ నుంచి ఎన్నో సలహాలు తీసుకుంటానని, అతనితో కలిసి పరుగెత్తడానికి ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

కోచ్ గౌతమ్ గంభీర్ ప్రోత్సాహం గురించి వివరిస్తూ... "గౌతమ్ సర్ నాలో ఎప్పుడూ నమ్మకాన్ని నింపుతారు. నైపుణ్యం ఉంటే అన్ని ఫార్మాట్లలో రాణించగలవని చెబుతారు. మ్యాచ్‌లలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్పేందుకు, ప్రాక్టీస్ సెషన్లలోనే నాపై ఒత్తిడి పెంచుతారు. నా సామర్థ్యంపై ఆయనకు పూర్తి నమ్మకం ఉంది. ఆ మద్దతు నాకు చాలా ముఖ్యం" అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.
Tilak Varma
Rohit Sharma
Virat Kohli
Gautam Gambhir
Indian Cricket Team
Team India
Cricket
Indian Batsman
Fitness
Cricket Coaching

More Telugu News