Jogi Ramesh: ములకలచెరువు కల్తీ మద్యం కేసు: జోగి రమేశ్‌కు 16 వరకు రిమాండ్

Jogi Ramesh Remanded Until 16th in Spurious Liquor Case
  • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను కోర్టుకు హజరుపర్చిన పోలీసులు 
  • రమేశ్‌కు 16 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
  • నెల్లూరు జైలు నుంచి పీటీ వారెంట్‌పై తంబళ్లపల్లెకు తరలింపు
నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌, ఆయన సోదరుడు జోగి రామును పోలీసులు తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ జరిపిన న్యాయమూర్తి, జోగి సోదరులిద్దరికీ ఈనెల 16వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
 
ఇటీవల ఈ కేసులో జోగి రమేశ్‌ను ఏ-32గా, ఆయన సోదరుడు రామును ఏ-33గా చేర్చిన ఎక్సైజ్ పోలీసులు, తంబళ్లపల్లె జూనియర్ సివిల్ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో కోర్టు పీటీ వారెంట్‌కు అనుమతినిచ్చింది. దీంతో ఇప్పటికే ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో అరెస్టయి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న జోగి సోదరులను, పీటీ వారెంట్‌పై భారీ భద్రత మధ్య తంబళ్లపల్లె కోర్టులో హాజరుపర్చారు.
 
విచారణ అనంతరం న్యాయాధికారి ఉమర్‌ ఫరూక్‌ రిమాండ్ విధించడంతో, వారిని తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్‌ను కలిసేందుకు తంబళ్లపల్లె వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మదనపల్లె వైసీపీ ఇన్‌చార్జి నిస్సార్ అహమ్మద్ కోర్టు వద్దకు చేరుకున్నారు. నిందితులతో మాట్లాడొద్దని పోలీసులు సూచించినా, కోర్టు నుంచి బయటకు వస్తున్న రమేశ్‌ను ఎమ్మెల్యే పలకరించారు. 
Jogi Ramesh
Mulakalacheruvu spurious liquor case
Andhra Pradesh spurious liquor
YSRCP leader
Peddireddy Dwarakanatha Reddy
Nellore Central Jail
fake liquor case
Tamballapalle court
Nissar Ahmed
Jogi Ramu

More Telugu News