Chandrababu Naidu: స్క్రబ్ టైఫస్ కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu Naidu Reviews Scrub Typhus Cases in Andhra Pradesh
  • వ్యాధిపై అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు
  • వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించాలని సూచన 
  • స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదన్న అధికారులు
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్‌తో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారిన పడి చందక రాజేశ్వరి అనే మహిళ మృతి చెందిన తరహా ఘటనలు మరెక్కడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చిగ్గర మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపై ప్రజలకు వివరించాలని అన్నారు. 
 
 
ఈ క్రమంలో చందక రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రికి సౌరభ్ గౌర్ వివరించారు. విజయనగరానికి చెందిన రాజేశ్వరికి చిగ్గర్ మైట్ అనే కీటకం కుట్టిందని, దీంతో ముందుగా టైఫాయిడ్ చికిత్స అందించారని...ఆ తర్వాత రాపిడ్ టెస్ట్ ద్వారా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేల్చారని సౌరభ్ గౌర్ సీఎంకు వివరించారు. విజయనగరం క్వాసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారని అధికారులు చెప్పారు. స్క్రబ్ టైఫస్ కేసులు, ఆ వ్యాధి లక్షణాలు, అలాగే వాటి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.
 
స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు
 
ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. చిగ్గర మైట్స్ అనే కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని, అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు... మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం వంటివి ఈ వ్యాధి లక్షణాలని ముఖ్యమంత్రికి తెలిపారు. సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ ఏడాదిలో చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెప్పారు. 
Chandrababu Naidu
Scrub typhus
Andhra Pradesh
Chiggar mite
Viral fever
Health advisory
Vizianagaram
Chittor
Kakinada
Infection

More Telugu News