Premchand: హైదరాబాద్‌లో దారుణం: 8 ఏళ్ల బాలుడిపై 20 వీధి కుక్కల దాడి

Hyderabad 8 Year Old Premchand Attacked by 20 Street Dogs
  • హైదరాబాద్ మన్సూరాబాద్‌లో ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
  • పుట్టుకతో మూగవాడైన ప్రేమ్‌చంద్‌పై ఎగబడిన 20 శునకాలు
  • దాడిలో బాలుడి చెవి ఛిద్రం, తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలు
  • ప్రస్తుతం నిలోఫర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స
హైదరాబాద్‌లో వీధి కుక్కలు మరోసారి బీభత్సం సృష్టించాయి. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శివగంగ కాలనీలో ఎనిమిదేళ్ల బాలుడిపై సుమారు 20 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. పుట్టుకతో మాటలు రాని ఆ చిన్నారి, సాయం కోసం అరవలేని నిస్సహాయ స్థితిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు, చంద్రకళ దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి శివగంగ కాలనీలో నివసిస్తున్నారు. వారి కుమారుడు ప్రేమ్‌చంద్‌ (8)కు పుట్టుకతో మాటలు రావు. నిన్న ఉదయం తల్లిదండ్రులు పనుల్లో ఉండగా, ప్రేమ్‌చంద్‌ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కుక్కల గుంపు అతడిపై దాడి చేసి, కిందపడేసి విచక్షణారహితంగా పీక్కుతిన్నాయి.

ఈ దాడిలో బాలుడి చెవి పూర్తిగా తెగిపోగా, తల, వీపు, నడుము భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు ధరించిన స్వెటర్‌ను పట్టుకుని కుక్కలు ఈడ్చేశాయి. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ స్థానికుడు రాళ్లు విసిరి కుక్కలను తరిమికొట్టడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ప్రేమ్‌చంద్‌ను స్థానికులు వెంటనే నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్‌కు తరలించారు.

ప్రస్తుతం బాలుడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, వైద్యులు తెగిపోయిన చెవికి శస్త్రచికిత్స చేశారని తల్లిదండ్రులు తెలిపారు. విషయం తెలుసుకున్న మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. 
Premchand
Hyderabad
dog attack
street dogs
Mansoorabad
Shivaganga Colony
Nallakunta Fever Hospital
Niloufer Hospital
Koppula Narsimha Reddy
Telangana

More Telugu News