Chandrababu Naidu: ప్రభుత్వ శాఖలకు ఆర్టీజీఎస్ కామన్ డేటా సెంటర్: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Focuses on RTGS Data Lake for AP Governance
  • ప్రభుత్వ శాఖలకు కామన్ డేటా సెంటర్‌గా ఆర్టీజీఎస్
  • ఈ నెలాఖరు నుంచి డేటా లేక్ ద్వారా సమాచార విశ్లేషణ
  • డిసెంబర్ చివరికల్లా వాట్సప్‌లో 794 ప్రభుత్వ సేవలు
  • పన్నుల వసూళ్లకు డేటా అనలిటిక్స్ వినియోగం
  • పనితీరు ఆధారంగా అధికారులకు నివేదికలు
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలన్నిటికీ రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కామన్ డేటా సెంటర్‌గా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచే ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించి 'డేటా లేక్' ద్వారా విశ్లేషించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం పెరిగేలా పౌరసేవలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్లేషించి, సేవలను మరింత సులభతరం చేయాలన్నారు. మీడియాలో వచ్చే ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని, ప్రజా ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు 175 నియోజకవర్గాల్లోని స్వర్ణాంధ్ర విజన్ యూనిట్లు కృషి చేయాలని అన్నారు.

డిసెంబర్ నెలాఖరులోగా 794 రకాల ప్రభుత్వ సేవలను వాట్సప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం లక్ష్యం నిర్దేశించారు. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, కాంట్రాక్టర్లు సక్రమంగా పన్నులు చెల్లించేలా డేటాను విశ్లేషించాలని ఆదేశించారు.

ప్రతి నెలా జీఎస్‌డీపీతో పాటు ఇతర ఆర్థిక సూచికలను సమీక్షిస్తామని, కేంద్రానికి పంపే నివేదికలు కూడా కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల (KPI) ఆధారంగానే ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తమ సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. ప్రజావసరాలకు అనుగుణంగానే పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.
Chandrababu Naidu
AP Government
RTGS
Real Time Governance
Data Lake
e-Governance
Andhra Pradesh
Government Schemes
GSDP
KPI

More Telugu News