Chandrababu Naidu: ఉత్తరాంధ్రలో మెటల్ క్లస్టర్.. గనుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Naidu Orders Metal Cluster in Uttarandhra
  • ఖనిజాలకు విలువ జోడించే పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచన
  • అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు డ్రోన్లు, శాటిలైట్ టెక్నాలజీ వాడాలన్న ముఖ్యమంత్రి
  • రాజధాని పనులకు మెటీరియల్ కొరత రాకూడదన్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక అమలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "లీజుకిచ్చిన గనులు కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరిగితే వాటిని ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా గుర్తించేలా చూడాలి. దీని కోసం డ్రోన్, శాటిలైట్ చిత్రాలను వినియోగించుకోవాలి. అలాగే గనుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకోవాలి. గనుల ద్వారా ఆదాయాన్ని పొందుతున్న రాష్ట్రాల్లో ఒడిశా మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారో గమనించి వాటిని మన రాష్ట్రంలో అమలు చేసే అంశాన్ని పరిశీలించాలి. 

అలాగే గనుల నుంచి వచ్చే వివిధ ఖనిజాలకు సంబంధించిన ముడి సరుకును ఇతర దేశాలకు ఎగుమతి చేయడంతోపాటు ఆ ఖనిజాలకు వాల్యూ యాడెడ్ చేయడం ద్వారా దేశీయంగా వాటిని వినియోగించుకుని మరింత ఆదాయం వచ్చేలా చేయాలి. విశాఖలో పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. బాగా అభివృద్ధి జరగబోతోంది. ఉత్తరాంధ్ర కేంద్రంగా మెటల్ కు సంబంధించిన క్లస్టర్ ఏర్పాటు చేయండి. విశాఖలో ఏర్పాటు కాబోయే వివిధ కంపెనీల నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సరఫరా జరిగేలా చూడాలి" అని ముఖ్యమంత్రి సూచించారు.

ఏయే ఖనిజాలు... ఏయే రంగాల్లో వాడతారో విశ్లేషించండి

"రాష్ట్రంలో లైమ్ స్టోన్, బీచ్ శాండ్, ఐరన్ ఓర్, మాంగనీస్, క్వార్ట్జ్, సిలికా శాండ్, క్లేస్, గ్రానైట్ సహా వివిధ ఖనిజాలు ఉన్నాయి. ఈ ఖనిజాలు ఏయే ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగపడతాయో విశ్లేషించండి. ఆ మేరకు ఏయే ఖనిజాలను నేరుగా ముడిసరుకు రూపంలో ఎగుమతులు చేయవచ్చు, ఏయే ఖనిజాలకు వాల్యూ యాడ్ చేసి దేశంలోనూ, రాష్ట్రంలోనూ వినియోగించుకోవచ్చోననే అంశంపై విశ్లేషించాలి. ఆ మేరకు గనుల శాఖ ఆలోచన చేయాలి. సిమెంట్ ఫ్యాక్టరీలు ఇప్పటికే లైమ్ స్టోన్ ఖనిజాన్ని తీసుకుంటున్నాయి. ఇదే విధంగా ఐరన్ ఓర్ స్థానికంగా ఉన్న స్టీల్ పరిశ్రమలు ఉపయోగించుకుంటున్నాయి. 

అలాగే బీచ్ శాండ్ ద్వారా టైటానియం ఉత్పత్తులు, మాంగనీస్ ఖనిజం ద్వారా ఫెర్రో ఎల్లాయిస్ ఉత్పత్తులు, క్వార్ట్జ్-సిలికా శాండ్ ద్వారా సోలార్ ప్యానెళ్లు, సోలార్ పీవీ సెల్స్ ఉత్పత్తి, గ్లాస్ ఉత్పత్తులు, గ్రానైట్ ద్వారా కటింగ్-పాలిషింగ్ పరిశ్రమలు వంటివి వస్తాయి. ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. ఇలా వాల్యూ ఎడిషన్ చేసే పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా గనుల శాఖ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాకాల పథకం ఏయే కంపెనీలకు వర్తిస్తుందో చూసి ఆయా కంపెనీలకు ఇన్సెంటీవ్ ఇచ్చేలా కేంద్రంతో సంప్రదిద్దాం. అప్పుడే రాష్ట్రానికి మరింతగా ఆదాయం పెరుగుతుంది. వీటితో పాటు ఫ్యూచరిస్టిక్ మినరల్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఈ మేరకు నిపుణుల సహయాన్ని తీసుకోండి" అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రాజధాని పనులకు మెటీరియల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదు

"రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్, మెటల్ వంటి వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయండి. నిర్మాణాలకు అవసరమైన మెటీరియర్ కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లభ్యమవుతాయి. ఈ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. సింగిల్ విండో విధానంలో నేరుగా కలెక్టర్లతో మాట్లాడి ఆ మెటీరియల్ ను సీఆర్డీఏకు పంపండి. మధ్యలో ఎవరైనా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇక ఇసుక సరఫరా విషయంలో సంతృప్త స్థాయి మరింత పెరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సరిహద్దుల వద్దనున్న చెక్ పోస్టులు, సీసీ కెమెరాల ద్వారా నిత్యం పరిశీలిస్తూ ఉండాలి" అని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. 
Chandrababu Naidu
Andhra Pradesh
Mines Department
Metal Cluster
Visakhapatnam
Mining
APMDC
Minerals
Revenue Generation
Free Sand Policy

More Telugu News