BAMRUK NUDDAULA LAKE: పాతబస్తీకి కొత్త అందం.. చారిత్రక బమృక్‌నుద్దౌలా చెరువుకు పునరుజ్జీవం

HYDRAA Revives Historic Lake in Old City
  • తుది మెరుగులు దిద్దుకుంటున్న బమృక్‌నుద్దౌలా చెరువు
  • మరో 15 రోజుల్లో ప్రారంభానికి సిద్ధం
  • 18 ఎకరాలకు విస్తరించిన చారిత్రక చెరువు
  • అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్
  • చెరువు పునరుద్ధరణపై స్థానికుల హర్షం
పాతబస్తీకి మణిహారంగా నిలిచే చారిత్రక బమృక్‌నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో ఈ చెరువును ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్రమణల కారణంగా ఆనవాళ్లు కోల్పోయిన ఈ చెరువు, హైడ్రా చేపట్టిన పునరుద్ధరణ పనులతో పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగ‌నాథ్ మంగ‌ళ‌వారం చెరువు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

చెరువు చుట్టూ నిర్మిస్తున్న బండ్, ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను ఆయన తనిఖీ చేశారు. చెరువుకు మూడు వైపులా నిర్మిస్తున్న ప్రవేశ మార్గాలను పరిశీలించి, స్థానికులు సులభంగా లోపలికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువు చుట్టూ ఔషధ మొక్కలు, నీడనిచ్చే చెట్లను నాటాలని ఆదేశించారు. ప్రజలు కూర్చునేందుకు వీలుగా నిర్మిస్తున్న గుమ్మటాలు (గజబోలు), ప్రవేశ ద్వారాలు ఇస్లామిక్ సంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని కోరారు. వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, పిల్లల కోసం ప్లే ఏరియాలు, వృద్ధులకు సీటింగ్ జోన్లు, ఓపెన్ జిమ్‌లు, పార్కులను త్వరగా పూర్తి చేయాలన్నారు. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, హైడ్రా ప్రధాన కార్యాలయం నుంచి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

గతంలో ఆక్రమణలకు గురై కేవలం 4.12 ఎకరాలకే పరిమితమైన ఈ చెరువును, హైడ్రా చొరవతో పూర్తిస్థాయిలో 18 ఎకరాలకు విస్తరించినట్లు రంగ‌నాథ్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులో ఆక్రమణలు తొలగించామని, ఈ చెరువు అభివృద్ధి ద్వారా వరద కట్టడితో పాటు భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందుతాయని వివరించారు.

1770లో నిజాం ప్రధాని నవాబ్ రుక్న్‌ఉద్‌దౌలా నిర్మించిన ఈ చెరువుకు ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ చెరువులోని నీటిని సుగంధ ద్రవ్యాల తయారీకి వాడేవారని, ఔషధ గుణాలుండేవని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఎంతో చరిత్ర ఉన్న ఈ చెరువు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీకి ఈ అభివృద్ధి ఎంతో అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
BAMRUK NUDDAULA LAKE
Hyderabad
Old City Hyderabad
Lake Restoration
HYDRAA
Telangana
Nawab Rukn ud Daula
Lake Development
Heritage
Water Conservation

More Telugu News