Jagadish Reddy: పవన్ కల్యాణ్ సినిమాలు చూడొద్దని కాంగ్రెస్ మంత్రులు చెబితే జనాలు వింటారా?: జగదీశ్ రెడ్డి

Jagadish Reddy Slams Congress Ministers Over Pawan Kalyan Movie Comments
  • సెన్సేషన్ కోసం డైలాగులు మాట్లాడవద్దని హితవు
  • పవన్ పది రోజుల క్రితం మాట్లాడితే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శ
  • స్పృహలో లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలను చూడవద్దని కాంగ్రెస్ మంత్రులు చెబితే ప్రజలు, అభిమానులు ఆగుతారా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సంచలనం కోసం డైలాగులు మాట్లాడవద్దని సూచించారు. రాజోలులో పవన్ కల్యాణ్ పది రోజుల క్రితం మాట్లాడితే కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ వారు కమీషన్లు పంచుకునే పనిలో పడి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఇన్ని రోజులు పట్టించుకోలేదా అని ఎద్దేవా చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు స్పృహలోకి వచ్చారా అని నిలదీశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించడానికి పది రోజులు పడుతుందా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు వాటర్‌లో నీళ్లు కలుపుకున్నట్లుగా ఉందని చురక అంటించారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు స్పందించడం వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా లేక మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి వారు రాష్ట్రాన్ని నడుపుతామంటే కష్టమేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలకు తెలంగాణ హక్కులు, ఆకాంక్షల పట్ల బాధ్యత లేనట్లుగా ఉందని విమర్శించారు. ఎవరు మాట్లాడినా ప్రజాస్వామిక పద్ధతిని పాటించాలని సూచించారు. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని అన్నారు.
Jagadish Reddy
Pawan Kalyan
Congress Ministers
Andhra Pradesh
Telangana

More Telugu News