Nara Lokesh: ఢిల్లీలో జీఎంఆర్ అధికారులతో మంత్రి లోకేశ్ భేటీ... విశాఖలో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ

Nara Lokesh Meets GMR Officials on Aviation EduCity in Vizag
  • ఢిల్లీలో జీఎంఆర్ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ భేటీ
  • విశాఖ వద్ద ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుపై విస్తృత చర్చ
  • దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధి ప్రణాళిక ఖరారు
  • ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్ అవుతుందని అంచనా
  • సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో విమానాశ్రయాల నిర్మాణ, నిర్వహణ దిగ్గజం జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. విశాఖపట్నం సమీపంలో దేశంలోనే మొట్టమొదటి 'ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ' అభివృద్ధిపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా ఖరారు చేశారు.

ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సంబంధించిన విద్య, శిక్షణలకు జాతీయ హబ్‌గా మారనుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను సైతం రాష్ట్రానికి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే గేమ్ ఛేంజర్ అవుతుందని, రాష్ట్రంలో ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ కీలక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు జీఎంఆర్ సంస్థ సీనియర్ అధికారులు ఎస్జీకే కిశోర్, సి.ప్రసన్న, పీయూష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
AP Aviation
GMR Group
Aviation Education City
Visakhapatnam
Andhra Pradesh
Aviation Hub India
Kinjarapu Rammohan Naidu
Aerospace
Defense Sector

More Telugu News