Imran Khan: జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు, కానీ మానసికంగా వేధిస్తున్నారు: సోదరి

Imran Khan healthy in jail but mentally harassed says sister
  • అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను కలిసిన సోదరి ఉజ్మా ఖాన్
  • ఇమ్రాన్ ఖాన్ ఫిట్‌గా, ఉత్సాహంగా ఉన్నారని వెల్లడి
  • మునీర్ జైలులో మానసికంగా వేధిస్తున్నారన్న ఉజ్మా
జైలులో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే మానసికంగా ఆయన తీవ్ర వేదన అనుభవిస్తున్నారని ఆయన సోదరి ఉజ్మా ఖాన్ వెల్లడించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఆమె కలిశారు. సోదరుడ్ని పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ మానసికంగా చాలా ధృఢంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధ పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు, అలాగే పీటీఐ పార్టీకి ఆయన సందేశాన్నిచ్చారని తెలిపారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జైలులో తనను మానసికంగా వేధిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు ఉజ్మా పేర్కొన్నారని స్థానిక మీడియా వెల్లడించింది.

జైలులో తనకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఆయన మానసిక స్థైర్యం చెక్కుచెదరకుండా ఉందని అన్నారు.

ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌కు ఇవాళ అనుమతి లభించడం తెలిసిందే. అంతకుముందు ఆయనను కలిసేందుకు పార్టీ నేతలకు, కుటుంబ సభ్యులకు అనుమతి లభించకపోవడంతో పీటీఐ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, మంగళవారం నాడు ఆయన సోదరిని జైలులోకి అనుమతించారు. పాకిస్థాన్ వార్తా వెబ్‌సైట్ డాన్ కథనం ప్రకారం, ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలని డిమాండ్ చేస్తూ జైలు ప్రాంగణం వెలుపల పీటీఐ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడిన సమయంలో ఉజ్మా జైలులోకి ప్రవేశించారు.
Imran Khan
Imran Khan arrest
Pakistan Tehreek-e-Insaf
Adiala Jail
Asim Munir

More Telugu News