Narendra Modi: ‘సేవా తీర్థ్’... ప్రధానమంత్రి కార్యాలయం పేరు మారింది!

PMO Renamed Seva Teerth by Central Government
  • ప్రధాని కార్యాలయ నూతన కాంప్లెక్స్‌కు ‘సేవా తీర్థ్’గా నామకరణం
  • దేశవ్యాప్తంగా రాజ్‌భవన్ల పేర్లను ‘లోక్‌ భవన్’గా మారుస్తున్న కేంద్రం
  • వలసవాద గుర్తులను తొలగించే ప్రక్రియలో భాగంగా ఈ మార్పులు
  • ఇప్పటికే రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా, పీఎం నివాసాన్ని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌గా మార్పు
  • ప్రజలకు సేవ అందించడమే ప్రభుత్వ లక్ష్యమనే సందేశం
దేశంలో వలసవాద గుర్తులను చెరిపేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాజ్‌భవన్ల పేర్లను ‘లోక్‌ భవన్’లుగా మార్చిన కేంద్రం, తాజాగా ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) నూతన కాంప్లెక్స్‌కు కూడా కొత్త పేరును ఖరారు చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ భవన సముదాయానికి ‘సేవా తీర్థ్’ అని నామకరణం చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించే ‘ప్రజలే ప్రథమం’ అనే విధానానికి, నిస్వార్థ సేవకు ప్రతీకగా ఈ పేరును ఎంపిక చేశారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న ఈ కాంప్లెక్స్‌లో పీఎంవోతో పాటు కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి కార్యాలయం ఉంటాయి. ప్రపంచ నేతలతో ఉన్నత స్థాయి సమావేశాల కోసం ‘ఇండియా హౌస్’ కూడా దీనిలో భాగంగా ఉంటుంది.

గత కొద్ది రోజులుగా ఉత్తరాఖండ్, కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోని రాజ్‌భవన్ల పేర్లను ‘లోక్ భవన్’గా మార్చిన విషయం తెలిసిందే. ఈ పరంపరలోనే పీఎంవోకు కూడా కొత్త పేరు పెట్టారు. గతంలో ప్రధాని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రధాని నివాసం ఉండే రేస్ కోర్స్ రోడ్డును ‘లోక్ కల్యాణ్ మార్గ్’గా, చారిత్రక రాజ్‌పథ్‌ను ‘కర్తవ్య పథ్’గా, సెంట్రల్ సెక్రటేరియట్‌ను ‘కర్తవ్య భవన్’గా మార్చింది.

‘రాజ్’ (పాలన) స్థానంలో ‘సేవ’, ‘కర్తవ్యం’, ‘లోక్’ (ప్రజలు) వంటి భావనలకు ప్రాధాన్యమిస్తూ పాలనా కేంద్రాలకు కొత్త పేర్లు పెడుతున్నారు. అధికారం కాకుండా బాధ్యత, సేవకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న సందేశాన్ని ఈ మార్పుల ద్వారా స్పష్టం చేస్తున్నారు.
Narendra Modi
PMO
Prime Minister Office
Seva Teerth
Central Vista Project
Lok Bhavan
Raj Bhavan
India House
Governance
Narendra Modi Government

More Telugu News