Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు..! నెల రోజుల ఉత్కంఠకు తెర

Imran Khan Alive Sister Meets Him in Adiala Jail
  • ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారన్న వదంతులకు తెర
  • రావల్పిండి జైల్లో సోదరి ఉజ్మా ఖాన్‌తో ఇమ్రాన్ భేటీకి అనుమ‌తి
  • 25 రోజులుగా కనిపించకపోవడంతో పెరిగిన అనుమానాలు
  • ఆయన జనాదరణకు భయపడే ప్రభుత్వం ఒంటరిని చేసిందని పార్టీ ఆరోపణ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం, ఉనికిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇమ్రాన్‌తో రావల్పిండిలోని అదియాలా జైల్లో భేటీ అయ్యేందుకు ఆయ‌న సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌తో అనుమ‌తి ల‌భించింది. దీంతో ఆయన జైల్లోనే మరణించారంటూ గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది.

గత 25 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ బయటి ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆయన జైల్లోనే మరణించి ఉండొచ్చని, ఈ వార్త బయటకు వస్తే తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతాయనే భయంతో ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చెందిన సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ వదంతులు మొదలయ్యాయి.

ఇమ్రాన్ ఖాన్ జనాదరణకు పాక్ ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఆయన్ను ఏకాకిని చేసి, దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెస్తోందని ఆయన పార్టీకి చెందిన సెనేటర్ ఖుర్రం జీషాన్ ఆరోపించారు. అందుకే ఆయన ఫొటోలు గానీ, వీడియోలు గానీ విడుదల చేయడం లేదని అన్నారు. ఇంతకుముందు ఇమ్రాన్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన సోదరీమణులపై దాడి జరగడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు న్యాయం చేయాలని కోరుతూ ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) కార్యకర్తలు ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం పెద్ద సభలపై నిషేధం విధించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పెరిగిన ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చి, ఆయన సోదరిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది.

72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. 2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తర్వాత నమోదైన అవినీతి కేసుల కింద 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన కొట్టిపారేస్తున్నారు.
Imran Khan
Pakistan
Imran Khan alive
PTI
Adiala Jail
Pakistan Tehreek-e-Insaf
Khawaja Khurram Jehan
Islamabad High Court
Pakistan Politics
Uzma Khan

More Telugu News