Nadendla Manohar: ధాన్యం రైతుల సమస్యలకు చెక్.. అందుబాటులోకి 1967 హెల్ప్‌లైన్: మంత్రి నాదెండ్ల

1967 Helpline Launched by Nadendla Manohar for Paddy Farmers Problems
  • ధాన్యం కొనుగోలు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్
  • రైతుల కోసం 1967 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ప్రారంభం
  • ఈ ఖరీఫ్ సీజన్‌లో 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
  • రైతుల ఖాతాల్లోకి రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు మంత్రి వెల్ల‌డి
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ కానూరులోని పౌరసరఫరాల భవనంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌తో పాటు, ‘1967’ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం ఆయన కంట్రోల్ రూమ్ పనితీరును పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇందుకుగాను రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ధాన్యం విక్రయ ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు.

రైతులు ధాన్యం రిజిస్ట్రేషన్, టోకెన్ల జారీలో జాప్యం, తూకంలో సమస్యలు, రవాణా, గోనె సంచుల కొరత వంటి ఏ సమస్య ఉన్నా 1967 నంబర్‌కు కాల్ చేయవచ్చని మంత్రి సూచించారు. ఈ హెల్ప్‌లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ఫిర్యాదు చేసే సమయంలో రైతులు తమ ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, టోకెన్ నంబర్, గ్రామ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, పరిష్కారం అయ్యేవరకు అధికారులు ఫాలోఅప్ చేస్తారని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ ఆర్. గోవిందరావు, అడ్మిన్ మేనేజర్ జి. శిరీష, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Nadendla Manohar
Paddy farmers
Paddy procurement
Andhra Pradesh
1967 helpline
Civil Supplies Department
MSP
Rythu Bharosa
Agriculture
Farmers issues

More Telugu News