Amaravati: అమరావతిలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. భూసేకరణకు ఉత్తర్వులు జారీ

Amaravati Second Phase Land Pooling Orders Issued
  • ఏడు గ్రామాల్లో 16,666 ఎకరాల సమీకరణకు ఉత్తర్వులు జారీ
  • అమరావతి, తుళ్లూరు మండలాల పరిధిలో భూముల సేకరణ
  • ప్రక్రియ వేగవంతం చేయాలని సీఆర్‌డీఏకు ప్రభుత్వ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రెండో విడత భూ సమీకరణకు (ల్యాండ్ పూలింగ్) రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఏడు గ్రామాల్లో భూములను సమీకరించేందుకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను చేపట్టాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులను విడుదల చేశారు.

రెండో విడతలో భాగంగా రాజధాని పరిధిలోని అమరావతి, తుళ్లూరు మండలాల్లో మొత్తం 16,666.57 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. ఇందులో 16,562.52 ఎకరాలు పట్టా భూములు కాగా, 104.01 ఎకరాలు అసైన్డ్ భూములుగా ఉన్నాయి. ఈ సమీకరణ పూర్తయ్యాక, అదనంగా 3,828.30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో రాజధాని అభివృద్ధి పనుల కోసం మొత్తం 20,494 ఎకరాలు సిద్ధం కానున్నాయి.

సమీకరించనున్న భూముల వివరాలు:
అమరావతి మండలం (7,465 ఎకరాలు): వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఏంద్రాయి, కర్లపూడి లేమల్లే గ్రామాల్లో భూములను సమీకరించనున్నారు.
తుళ్లూరు మండలం (9,097 ఎకరాలు): వడ్లమాను, హరిశ్చంద్రాపురం, పెద్దపరిమి గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టనున్నారు.

భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే మొదటి విడతలో భూములను సమీకరించగా, ఇప్పుడు రెండో విడత కూడా పూర్తయితే అమరావతిలో మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన భూమి పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
Amaravati
Amaravati land pooling
Andhra Pradesh capital
CRDA
Land acquisition
Tulluru mandal
Land pooling scheme
AP CRDA
Andhra Pradesh news
Suresh Kumar

More Telugu News