Khushboo Patani: ప్రమాద బాధితులకు అండగా నటి దిశా పటానీ సోదరి.. వ్యవస్థపై ఆగ్రహం

Khushboo Patani Helps Accident Victims Criticizes System
  • ఢిల్లీ-లక్నో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
  • గంటన్నర ఆలస్యంగా అంబులెన్స్ రావడంపై ఖుష్బూ పటానీ తీవ్ర ఆగ్రహం
  • సొంతంగా ఆటోలో బాధితులను ఆసుపత్రికి తరలించిన వైనం
  • ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి
బాలీవుడ్ నటి దిశా పటానీ సోదరి ఖుష్బూ పటానీ మానవత్వాన్ని చాటుకున్నారు. ఢిల్లీ-లక్నో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అండగా నిలిచి, అత్యవసర సేవల వైఫల్యాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. అంబులెన్స్ రావడానికి గంటన్నరకు పైగా సమయం పట్టిందని ఆమె ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.

మొరాదాబాద్ సమీపంలో ఆదివారం వేగంగా వచ్చిన ఓ బస్సు, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పెళ్లికి వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఖుష్బూ పటానీ, ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు.

క్షతగాత్రులకు సాయం అందించి, వారిలో నలుగురైదుగురిని ఒక ఆటోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తూ, "ప్రమాదం జరిగి గంట దాటినా అంబులెన్స్ రాలేదు. 12-13 మంది బాధితుల్లో ఇప్పుడు బతికి ఉండేది 2-3 మందేనేమో. అంబులెన్స్ గంటన్నర ఆలస్యంగా వచ్చింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

కొంతమంది యువకులు సాయం చేయకుండా వీడియోలు తీయడంపై ఆమె మండిపడ్డారు. "భారత పౌరులుగా మన ప్రాధాన్యం వీడియోలు తీయడం కాదు, ప్రాణాలు కాపాడటం. పోలీసుల భయం లేకుండా ఇలాంటి సమయాల్లో ముందుకు వచ్చి సాయం చేయాలి" అని ఆమె పిలుపునిచ్చారు. పీటీఐ కథనం ప్రకారం.. మృతులను ఒకే కుటుంబానికి చెందిన మతి (30), సుమన్ (30), సీమా (35), ఆర్తి (20), అమన్ (15), అనన్య (12)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Khushboo Patani
Disha Patani sister
Moradabad accident
Road accident India
Delhi Lucknow highway
Emergency services failure
Indian road safety
Victims assistance
Social responsibility
Ambulance delay

More Telugu News