PV Sunil Kumar: కాపు సీఎం, దళిత డిప్యూటీ సీఎం.. ఐపీఎస్ సునీల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

PV Sunil Kumar Controversial Comments on Kapu CM Dalit Deputy CM
  • కాపులు, దళితులు కలిస్తే అధికారమన్న ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్
  • సర్వీస్ నిబంధనలకు విరుద్ధమంటూ తీవ్ర విమర్శలు
  • సునీల్ కుమార్‌ను తొలగించాలని డీవోపీటీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు
  • రఘురామ కేసులో ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న అధికారి
సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రాజకీయ పార్టీల నేతల తరహాలో కులాల సమీకరణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాపులు, దళితులు కలిసి పనిచేస్తే రాజ్యాధికారం సాధించవచ్చని ఆయన చేసిన ప్రసంగం సర్వీస్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.

అనకాపల్లి జిల్లా గాంధీగ్రామంలో ఆదివారం జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సునీల్ కుమార్ ప్రసంగించారు. ‘‘మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. ఐదేళ్లపాటు ఉండే పదవి కావాలి’’ అని వ్యాఖ్యానించారు. హర్షకుమార్, విజయ్‌కుమార్, జడ శ్రవణ్‌కుమార్‌ వంటి వారిలో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. దళితవాడ పంచాయతీ డిమాండ్‌కు కాపు సోదరులు మద్దతిస్తే, తాము వారికి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రసంగ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారి ఇలా రాజకీయ, కులపరమైన వ్యాఖ్యలు చేయడం అఖిల భారత సర్వీసుల (ప్రవర్తన) నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమేనని విశ్రాంత అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇది దుష్ప్రవర్తన కిందకు వస్తుందని, ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని చెబుతున్నారు.

ఈ వ్యాఖ్యలపై శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తీవ్రంగా స్పందించారు. సునీల్ కుమార్‌ను వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) కార్యదర్శికి సోమవారం లేఖ రాశారు. కులాలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ, సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో తనను సీఐడీ కస్టడీలో అంతమొందించేందుకు యత్నించారంటూ రఘురామ పెట్టిన కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా (ఏ1) ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు కారణంగానే ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఇదే కేసులో డిసెంబర్ 4న విచారణకు హాజరు కావాలని సీఐడీ ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి   
PV Sunil Kumar
IPS PV Sunil Kumar
Kapu CM
Dalit Deputy CM
Raghurama Krishna Raju
Andhra Pradesh Politics
Suspension
CID Investigation
All India Services Conduct Rules
Anakapalli

More Telugu News